Yashasvi Jaiswal in IPL:


ఐపీఎల్‌ 2023లో మెరుపులు మెరిపిస్తున్న యశస్వీ జైశ్వాల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. మైదానంలోకి వెళ్లి బాగా ఆడాలని ప్రతిసారీ మైండ్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆడుతున్నప్పుడూ ఇలాగే ఆలోచించానని వెల్లడించాడు. మ్యాచులో విజయం అందుకున్నాక అతడు మీడియాతో మాట్లాడాడు.


'నా మదిలో ఎప్పుడూ ఒకటే ఉంటుంది. మైదానంలోకి వెళ్లి బాగా ఆడాలని అనుకుంటాను. ఈ రోజెందుకో బాగా అనిపించింది. ఇదేమీ అనుకోకుండా జరిగింది కాదు! ప్రతి మ్యాచ్‌కు బాగా సన్నద్ధం అవుతాను. నన్ను నేను నమ్ముకుంటాను. మంచి ఫలితమే వస్తుందని తెలుసు. విన్నింగ్‌ షాట్‌ కొట్టడం గ్రేట్‌ ఫీలింగ్‌. మ్యాచును గెలిపించడమే నా లక్ష్యం. సెంచరీ మిస్సైనందుకు బాధేమీ లేదు. సామర్థ్యం మేరకు ఆడాను. అందుకు గర్వపడుతున్నాను' అని యశస్వీ జైశ్వాల్‌ అన్నాడు.


'ఆడేటప్పుడు నెట్‌ రన్‌రేట్‌ గురించే ఆలోచించాను. మ్యాచ్‌ను వీలైనంత త్వరగా ముగించాలనే నేనూ, సంజూ మాట్లాడుకున్నాం. మ్యాచులో రనౌట్లు సహజమే. బట్లర్‌ రనౌట్‌ కావడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. రనౌట్‌ గురించి ఆలోచించొద్దని, నా గేమ్‌ నేను ఆడుకోవాలని సూచించాడు. నాలాంటి యంగ్‌స్టర్స్‌కు అవకాశం ఇచ్చినందుకు రాజస్థాన్‌ రాయల్స్‌, ఐపీఎల్‌కు కృతజ్ఞతలు. నాలాంటి కుర్రాళ్ల కలలు సాకారం చేసుకొనేందుకు ఇదో మంచి వేదిక' అని జైశ్వాల్‌ అన్నాడు.


జైశ్వాల్‌ను రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అభినందించాడు. 'ఈ రోజు నేను చేసేందుకు ఏమీ లేదు. బంతిని చూసి కొట్టడం.. జైశ్వాల్‌ బ్యాటింగ్‌ను చూడటమే నా పని. మేం దీనికి అలవాటు పడ్డాం. పవర్‌ప్లేలో అతడెలా ఆడతాడో బౌలర్లకూ తెలుసు. తొలి ఆరు ఓవర్లలో ఆడటం అతడికెంతో ఇష్టం. ఇక యుజ్వేంద్ర చాహల్‌ లెజెండ్‌గా అవతరించాడు. మా ఫ్రాంచైజీలో అతను ఆడటం సంతోషం' అని పేర్కొన్నాడు. 


Rajasthan Royals vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 2023 సీజన్ 56వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర ఓటమి పాలైంది. ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ కేవలం 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.


యశస్వి జైస్వాల్ (98 నాటౌట్: 47 బంతుల్లో, 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు) నిస్వార్థమైన ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను దగ్గరుండి గెలిపించాడు. తనకు సంజు శామ్సన్ (48 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అంతకు ముందు కోల్‌కతా బ్యాటర్లలో అర్థ సెంచరీ సాధించిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీని యశస్వి జైస్వాల్ సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే యశస్వి జైస్వాల్ అర్థ శతకం పూర్తయింది.