Mlc Anantababu : కాకినాడలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం  హత్య కేసులో 88 రోజుల తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మే 23వ తేదీ  ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు చాలా వ్యూహాత్మకంగా చివరి నిమిషంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.


సాంకేతిక కారణాల సాకులు


కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబుపై కాకినాడ పోలీసులు గురువారం ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. నిందితుడి తరుపు న్యాయవాది వేసిన బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో పోలీసులు కావాలనే ఆలస్యం చేశారని బాధితుని బంధువులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణం హత్య జరిగి 88 రోజులు గడిచినా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ పోలీసులు ఇప్పటి వరకూ ఛార్జ్ షీట్‌ దాఖలు చేయలేదు. చట్టం ప్రకారం 90 రోజుల్లో ఛార్జ్ షీటు దాఖలు చేయకపోతే నిందితుడికి బెయిల్‌ ఇచ్చే అవకాశం ఉంది. 


నిందితుడి సహకరిస్తున్నారనే ఆరోపణలు 


ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  మానవ హక్కుల సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు ఆందోళనలతో దిగివచ్చిన పోలీసులు ఆఖరికి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 22న ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విచారణకు రానుంది. మృతుని కుటుంబం తరుపున ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు న్యాయపోరాటం చేస్తు్న్నారు. హైకోర్టులో మాజీ న్యాయమూర్తి, న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. 


డ్రైవర్ హత్య కలకలం 


డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో తెచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చెప్పాడు ఎమ్మెల్సీ అనంతబాబు. అనంతరం అనంతబాబు పరారీలో ఉన్నాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరవుతూ ఏం జరగనట్లే వ్యవహరించారు. అయితే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని అరెస్టుచేశారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. మే 19న ఘటన జరిగిన తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని అప్పట్లో పోలీసులు తెలిపారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఇగో హర్ట్ అయ్యి నెట్టడంతో డ్రైవర్ చనిపోయాడని ఎస్పీ ఇచ్చిన వివరణపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. 


Also Read : Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం