Power Exchange Ban : ఏపీ, తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు కేంద్రం షాక్ ఇచ్చింది. డిస్కంలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విద్యుత్ కోతలు తప్పేటట్లులేవు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా 13 రాష్ట్రాల్లో ఈ అంశం స్థానిక ప్రభుత్వాలకు సమస్యగా మారింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. పవర్ ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించి రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. 


13 రాష్ట్రాలపై నిషేధం ప్రభావం 


కేంద్ర ప్రభుత్వ నిషేధంతో రెండు రాష్ట్రాల డిస్కంలు ఎక్స్ఛేంజీల విద్యుత్‌ కొనుగోలు, మిగులు విద్యుత్‌ అమ్మకాలకు అవకాశం లేదు. కేంద్రం నిషేధం విధించిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మణిపూర్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్ము-కశ్మీర్‌, బిహార్‌,మిజోరం, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిస్కంలు ఉన్నాయి. ఈ నిషేధం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు విధించే అవకాశం కనిపిస్తుంది. కేంద్రం ఎల్‌పీఎస్‌ నిబంధనల కారణంగా రాష్ట్రాల డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌ బిల్లులను విద్యుదుత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం  బకాయిలుంటే కేంద్రం చర్యలు చేపట్టింది.


ఎక్స్ఛేంజీలకు తెలంగాణ లేఖ 


కేంద్ర తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. శుక్రవారం రియల్‌టైం మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ అధికారులు తెలిపారు. పీక్ డిమాండ్ సమయంలో రోజుకు 10-15 మిలియన్‌ యూనిట్ల కరెంట్ అవసరం అవుతుందన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్‌ ద్వారా విద్యుత్‌ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. విద్యుత్‌ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని లేఖలో ఆయన గుర్తుచేశారు.


ఏపీ పేరు తొలగింపు 


కేంద్రం విద్యుత్ కొనుగోళ్ల నిషేధంపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పందించారు. పవర్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలు లేదని తెలిపారు. సమాచారం లోపం వల్లే విద్యుత్‌ కొనుగోళ్ల నిషేధిత జాబితాలో ఏపీని చేర్చారని తెలిపారు. విద్యుత్‌ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదన్నారు. ఏపీ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.350 కోట్లు చెల్లించేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపీ పేరు తొలగించారని విజయానంద్‌ తెలిపారు. 


Also Read : AP Politics: నన్ను టార్గెట్ చేశారు, నాపై కుట్ర జరుగుతోంది - మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు


Also Read : MLA Ashok Arrest: పలాసలో హై టెన్షన్, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్ - అసలేమైందంటే?