MLA Ashok Arrest: శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక శ్రీనివాసనగర్ లోని 52 ఇళ్ల కూల్చి వేతకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సిద్ధం అయ్యారు. జేసీబీలతో ఇళ్ల కూల్చివేత కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అయితే మంత్రి అప్పల రాజుపై విమర్శలు చేయడంతో.. టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గురిటి సూర్య నారాయణకు చెందిన నాలుగు ఇళ్లను అధికార పార్టీ నేతలు టార్గెట్ చేశారు. టీడీపీ నేతల ఇళ్లను టార్గెట్ చేసి ఆక్రమణల పేరుతో తొలగిస్తున్నారంటూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అధికార విపక్ష కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలకు మద్దతుగా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే బెందాలం అశోక్ అక్కడికి వచ్చారు. కార్యకర్తలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఎమ్మెల్యే అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


టీడీపీ-వైసీపీ, ఉప్పు-నిప్పు


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ కదులుతుంటే, ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలన్న కసి టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఏ చిన్న అంశాన్ని కూడా వదలకుండా అధికార పార్టీపై తెలుగు దేశం నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడ ఏ అంశం దొరుకుతుందా అన్నట్లుగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేనినీ వదలకుండా అధికార వైసీపీ పార్టీ నాయకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. 


ఏ అంశాన్ని వదలని అధికార, విపక్షాలు 
వైసీపీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. టీడీపీ నాయకులు చేస్తున్న దాడికి ఎదురు దాడి చేస్తోంది. అధికారం కూడా చేతిలో ఉండటంతో వైసీపీ నేతల దాడి మరింత ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఉప్పూ నిప్పులా వ్యవహరిస్తున్నారు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు. ప్రతి చిన్న అంశంపైనా పెద్ద స్థాయిలో యుద్ధం చేస్తున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. టీడీపీ నాయకులే తన వీడియోను మార్ఫింగ్ చేసి కుట్ర పూరితంగా దానిని వైరల్ చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. టీడీపీ నాయకులు అదే స్థాయిలో వైసీపీపై ఎదురు దాడి చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఆ వీడియోలో గోరంట్ మాధవ్ నగ్నంగా మరో మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా ఉంది. అయితే ఈ వీడియోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేశాయి. అన్ని గ్రూపుల్లో ఆ వీడియో దర్శనమిచ్చింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తు డిమాండ్ చేస్తుంటే.. మార్ఫింగ్ చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు పెట్టి చర్యలు చేపట్టాలని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.