IIT Madras:


ఐఐటీ మద్రాస్‌లో ఆత్మహత్య 


ఒంటరితనం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా టీనేజ్‌లో లోన్‌లీగా ఫీల్ అయ్యే వాళ్లు ఎక్కువ రోజులు ఆ ఫీలింగ్‌ను భరించలేరు. "ఈ బాధతో బతకలేను" అని ఫిక్స్ అయిపోతారు. చివరకు ప్రాణాలు తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తమకు తామే ఒంటరినని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఐఐటీల్లో ఇలాంటి సూసైడ్స్‌ ఎక్కువగా వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. చెన్నైలో ఓ ఐఐటీ విద్యార్థి తన రూమ్‌లోనే ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. "ఎవరికీ నాతో మాట్లాడే టైమ్ లేదు. అందరూ బిజిగానే ఉన్నారు" అని ఫ్రెండ్స్‌తో తరచూ చెప్పే వాడని తెలుస్తోంది. కెమికల్ ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల స్టూడెంట్‌ రూమ్‌లో ఓ నోట్ కూడా దొరికిందని పోలీసులు వెల్లడించారు. అయితే...దానిపై డేట్ కానీ, సంతకం కానీ లేవు. తనతో బాగా మాట్లాడిన ఫ్రెండ్స్‌కి మాత్రం థాంక్స్ చెప్పాడు ఆ స్టూడెంట్. అకాడమిక్స్‌లో బ్రిలియంట్‌గా పేరు తెచ్చుకున్న విద్యార్థి ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. IIT మద్రాస్‌లో ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా..."ఆ విద్యార్థికి ఆత్మహత్యకు కారణమేంటో తెలియదు" అని సమాధానమిచ్చింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. 


ఒత్తిడి తట్టుకోలేక..


ఇప్పటికే "be happy" పేరిట ఓ వెబ్‌సైట్‌ని నడుపుతోంది ఐఐటీ మద్రాస్. స్ట్రెస్ నుంచి విద్యార్థులను బయట పడేసేందుకు ఇది ఉపయోగపడుతోందని వివరిస్తోంది. దీంతో పాటు పాజిటివ్ థింకింగ్ పెంచేందుకు Kushal faculty programme మొదలు పెట్టింది. ఇటీవలే ఇదే క్యాంపస్‌లో ఓ పీహెచ్‌డీ స్కాలర్ అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీలో సీట్ కోసం చాలా కష్టపడతారు విద్యార్థులు. అవసరమైన దానికంటే ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారు. కోచింగ్ సెంటర్‌లు వాళ్లను దారుణంగా రుద్దుతాయి. అయితే...ఒక్కసారి సీట్ వచ్చిన తరవాత అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఐదేళ్ల పాటు అక్కడే ఉండడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి ఐఐటీ మద్రాస్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. కరోనా కారణంగా చాలా మంది ఒంటరిగా గడపాల్సి వచ్చిందని,ఈ ఆత్మహత్యలకు ఇది కూడా ఓ కారణమని వివరిస్తోంది. క్లాసెస్‌కి అటెండ్ కాకుండానే పాసౌట్ అవుతున్నారని చెబుతోంది. ఇక వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇన్‌ఫీరియర్‌గా ఫీల్ అవుతుండటమూ ఈ తరహా ఆత్మహత్యలకు మరో కారణంగా చెబుతున్నారు ప్రొఫెసర్‌లు. కొందరు విద్యార్థులు అలాంటి వారిపై వివక్ష చూపిస్తున్నారని, ఇది మానసికంగా వాళ్లను తీవ్రంగా వేధిస్తోందని అంటున్నారు. మద్రాస్‌లోనే కాకుండా. దేశవ్యాప్తంగా అన్ని IIT క్యాంపస్‌లలో వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లు మొదలు పెట్టారు. అయినా ఆత్మహత్యలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 


Also Read: Mamata Banerjee: దేశాన్ని విడదీసే కుట్రల్ని తిప్పికొడతా, ప్రాణాల్ని కూడా లెక్క చేయను - బీజేపీపై మమతా ఫైర్