IPL Playoff Schedule: గత నెల 31న అహ్మదాబాద్ వేదికగా మొదలైన  ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2023  ఎడిషన్ క్రమక్రమంగా  ఆసక్తిని రేకెత్తిస్తున్నది.  మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ  క్యాష్ రిచ్ లీగ్‌లో  బీసీసీఐ తాజాగా   ప్లేఆఫ్స్, ఫైనల్ జరిగే వేదికలను ప్రకటించింది.   ప్లేఆఫ్స్‌లో భాగంగా  క్వాలిఫయర్ - 1, ఎలిమినేటర్ చెన్నైలో  జరుగనుండగా     క్వాలిఫయర్ - 2,  ఫైనల్  అహ్మదాబాద్ వేదికగా  నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.  2022లో కూడా   ఫైనల్  (గుజరాత్ - రాజస్తాన్)  అహ్మదాబాద్‌లోనే ముగియడం గమనార్హం. 


మార్చి 31న మొదలైన ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్‌లు మే 21 వరకు జరుగనున్నాయి.  మే 21న ముంబై - హైదరాబాద్, బెంగళూరు - గుజరాత్ తో  ముగిసే మ్యాచ్‌లతో లీగ్ దశకు తెరపడుతుంది. అప్పటికి ఐపీఎల్ - 16 పాయింట్ల పట్టికలో టాప్ - 4 టీమ్స్ ప్లేఆఫ్స్ ఆడతాయి.  


ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్, వేదికలు.. 


- మే 23న తొలి క్వాలిఫయర్  జరుగనుంది. టేబుల్ టాపర్స్  1, 2వ స్థానాల్లో ఉన్న జట్లు  చెన్నైలో మ్యాచ్ ఆడతాయి.  


- మే 24న చెన్నైలోనే  ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.  3, 4 వ స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ ఆడతాయి.  


- మే 26న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో క్వాలిఫయర్ -2 జరుగుతుంది.  ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ -1లో  ఓడిన జట్టు  ఈ మ్యాచ్ లో తలపడతాయి.  


- మే 28న క్వాలిఫయర్ - 1, 2 లలో విజేతగా నిలిచిన జట్లు అహ్మదాబాద్ లోనే ఫైనల్స్ ఆడతాయి.   ఈ మ్యాచ్ తర్వాత  లీగ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. 


 






కాగా మూడు వారాలుగా సాగుతున్న ఐపీఎల్- 2023 లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ తో పాటు టైటిల్ ఫేవరేట్స్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్.. గతేడాది చెత్త ప్రదర్శనతో  విమర్శలు మూటగట్టుకున్నా ఈ సీజన్ లో పుంజుకుని  ఆడుతున్న  చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లతో పాటు  2022 లో ప్లేఆఫ్స్ ఆడిన లక్నో సూపర్ జెయింట్స్  ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇంతవరకూ కప్ కొట్టని ఆర్సీబీ కూడా ఆరు మ్యాచ్ లో  3 గెలిచి 3 ఓడి   ప్లేఆఫ్స్ కోసం దూసుకొస్తున్నది. మరో రెండువారాలు ముగిస్తే గానీ  ప్లేఆఫ్స్ వచ్చే జట్లపై  స్పష్టత రావడం కష్టమే.. 


ఏప్రిల్ 21 నాటికి పాయింట్లపట్టికలో ఆయా జట్ల స్థానాలివి.. 


1. రాజస్తాన్ రాయల్స్
2. లక్నో సూపర్ జెయింట్స్ 
3. చెన్నై సూపర్ కింగ్స్ 
4. గుజరాత్ టైటాన్స్ 
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 
6. ముంబై ఇండియన్స్ 
7. పంజాబ్ కింగ్స్ 
8. కోల్‌కతా నైట్ రైడర్స్
9. సన్ రైజర్స్ హైదరాబాద్ 
10. ఢిల్లీ క్యాపిటల్స్