MI vs PBKS Preview:  ఐపీఎల్ - 16  పాయింట్ల పట్టికలో  6, 7 వ స్థానాల్లో ఉన్న  ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌లు శనివారం రాత్రి (7 గంటల నుంచి) వాంఖెడే (ముంబై) వేదికగా తలపడబోతున్నాయి.  రెండు పరాజయాల తర్వాత  హ్యాట్రిక్ విజయాలతో  జోష్ మీదున్న ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) ను సొంత గ్రౌండ్‌లో ఢీకొనడం  పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)కు అంత ఈజీ కాదు.  మరోసారి ఆ జట్టు  రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ లేకుండానే బరిలోకి దిగుతున్నది. 


జోష్‌లో ముంబై.. 


ఈ సీజన్‌లో  తొలుత ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన ముంబై  తర్వాత  పుంజుకుంది.  ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి హ్యాట్రిక్ కొట్టింది.  తొలి రెండు మ్యాచ్ లలో విఫలమైన ఆటగాళ్లు కూడా  తర్వాత కుదురుకున్నారు. ఓపెనింగ్  జోడ రోహిత్ - ఇషాన్ లు భారీ  ఇన్నింగ్స్ లు ఆడకపోయినా ఉన్నంతలో  పవర్ ప్లేలో మెరుపులు మెరిపిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ కూడా  కేకేఆర్ తో మ్యాచ్ లో కుదుటపడ్డాడు.  ముంబై ఇండియన్స్  తరఫున ఈ సీజన్ లో ఆడుతున్న కామెరూన్ గ్రీన్.. బ్యాట్, బాల్ తో దూకుడుమీదున్నాడు.  ఇక ఏ పొజిషన్  ఇచ్చినా బాదడానికి నేను రెడీ అన్నట్టుగా  ఆడుతున్న తిలక్ వర్మ ముంబై బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉన్నాడు. చివర్లో టిమ్ డేవిడ్  కు ఇంకా  మెరుపులు మెరిపించే అవకాశమే రాలేదు. 


బ్యాటింగ్‌లో సాలిడ్ గా ఉన్న ముంబై.. బౌలింగ్‌లో అంత  స్ట్రాంగ్ గా లేదు. రెండు మ్యాచ్ లు ఆడిన అర్జున్ టెండూల్కర్..  పంజాబ్‌తో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. కాగా ఫస్ట్ మ్యాచ్ లో గాయపడ్డ  జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ ‌కు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ఆర్చర్ కూడా వస్తే  బెహ్ర‌న్‌డార్ఫ్  లేదా రిలే మెరిడిత్ లలో ఎవరో ఒకరు బెంచ్ కు పరిమితమవ్వాల్సిందే.  స్పిన్నర్లలో వెటరన్ చావ్లా అద్భుతాలు చేస్తుండగా  హృతీక్ షోకీన్ కూడా జోరుమీదే ఉన్నాడు. 


 






పంజాబ్  ఢీలా.. 


ముంబై ఉన్నంత జోష్‌లో పంజాబ్ లేదు.  ఆడిన  తొలి రెండు మ్యాచ్ లలో గెలిచిన ఆ జట్టు సన్ రైజర్స్ ఇచ్చిన షాక్ తర్వాత  ఢీలా పడింది.  గుజరాత్  చేతిలో ఓడిన ఆ జట్టు లక్నో పై గెలిచినా మళ్లీ ఇటీవలే ఆర్సీబీతో పోరులో ఓడింది. ఆరింట మూడు గెలిచి మూడింట్లో  ఓటమి పాలైన ఆ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భుజం గాయం కారణంగా   శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో కూడా ఆడటం లేదని  ఆ జట్టు వర్గాలు తెలిపాయి.  దీంతో మరోసారి సామ్ కరనే సారథిగా ఉండనున్నాడు.  ఓపెనర్ అథర్వ  ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ  రాణించలేదు.  ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆర్సీబీతో మ్యాచ్  లో ఫామ్ అందుకున్నాడు.   కానీ మాథ్యూ షార్ట్  తొలుత మెరిపించినా  తర్వాత విఫలమవుతున్నాడు.  ఆర్సీబీతో ఎంట్రీ ఇచ్చిన లియామ్ లివింగ్‌‌స్టొన్ కూడా ఆకట్టుకోలేదు.   గత మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన జితేశ్ శర్మ  ముంబైతో ఏం చేస్తాడో చూడాలి. 


పంజాబ్ బౌలర్లు కూడా పదే పదే విఫలమవుతున్నారు. గత మ్యాచ్ లో ఆడిన నాథన్ ఎల్లీస్ స్థానంలో రబాడాను ఆడించొచ్చు.  బ్యాటింగ్ లో విఫలమైనా  కెప్టెన్ కరన్  బౌలింగ్  లో ఫర్వాలేదనిపిస్తున్నాడు.   స్పిన్నర్ రాహుల్ చాహర్ ఈ సీజన్ లో ఇప్పటివరకు తనదైన ముద్ర వేయలేదు. 


 






పిచ్ రిపోర్ట్ : వాంఖెడే  బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలమే.   ఇక్కడ ఛేదన చేసిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ లో కూడా ఛేజ్ చేసిన చెన్నై, ముంబైకే విజయాలు దక్కాయి. వాంఖెడేలో మొత్తం రాత్రి పూట జరిగిన 32 టీ20 మ్యాచ్ లలో  22 సార్లు ఛేదన చేసిన జట్టుదే విజయం. వాంఖెడే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 


హెడ్ టు హెడ్ :  ఐపీఎల్‌లో ముంబై - పంజాబ్ లు 29 సార్లు తలపడితే ఇందులో ముంబై 15 మ్యాచ్ లు గెలుచుకోగా  పంజాబ్  14 సార్లు గెలిచి  టఫ్ ఫైట్ ఇస్తోంది.  వాంఖెడేలో  ఇరు జట్లు 9 సార్లు ఆడగా ఇందులో కూడా ముంబై  (5 విజయాలు) - పంజాబ్ (4 విజయాలు ) హోరాహోరిగా ఆడాయి. 


తుది జట్లు (అంచనా) : 


పంజాబ్ కింగ్స్ : అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టొన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, సికందర్ రజా,  జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, సామ్ కరన్ (కెప్టెన్), హర్‌ప్రీత్  బ్రర్, కగిసొ రబాడా, అర్ష్‌దీప్ సింగ్ 


ఇంపాక్ట్ ప్లేయర్లు : నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్ 


ముంబై ఇండియన్స్ :  రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, హృతీక్ షోకీన్, పియూష్ చావ్లా  


ఇంపాక్ట్ ప్లేయర్లు : జేసన్  బెహ్ర‌న్‌డార్ఫ్, రిలీ మెరిడిత్