Twitter Blue Tick: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ యజమాని ఎలన్ మస్క్  అన్నంత పనిచేశాడు. డబ్బులు చెల్లించకుంటే ట్విటర్ అధికారిక ఖాతాలకు సంబంధించిన ‘బ్లూ టిక్’లను తొలగిస్తామని గతంలోనే హెచ్చరించిన  ఆ సంస్థ.. అన్నంత పని చేసింది.  నిర్ణీత  రుసుము చెల్లించనివారిని ఎవరినీ వదలకుండా   ‘వెరీఫైడ్’ సింబల్ తీసేసిది. ఈ జాబితాలో  ప్రపంచంలోని  ప్రముఖ వ్యక్తులతో పాటు టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. జాబితాలో  భారత క్రికెట్ జట్టు దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ సారథులు  మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత కెప్టెన్  రోహిత్ శర్మ  కూడా ఉండటం గమనార్హం. 


ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన చాలామంది ఈ జాబితాలో ఉన్నవారే. బ్లూటిక్  ఉండాలంటే నెలవారీగా నిర్ణీత రుసుము చెల్లించాలని ట్విటర్ గతంలోనే హెచ్చరించింది. ఈ మేరకు కాల పరిమితి విధించినా చాలా మంది అందుకు నిరాకరించారు. దీంతో మస్క్  అనుకున్నంత పని చేశాడు. భారత్ లో కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో పాటు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, జగన్‌మోహన్ రెడ్డి,  కేజ్రీవాల్, మమతా బెనర్జీలు కూడా తమ అధికారిక ఖాతాలకు బ్లూటిక్ కోల్పోయారు. 


చెప్పి మరీ చేసిన మస్క్.. 


ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత  సంస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్.. ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను పలు మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా  అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌కు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందేనని  కొత్త నిబంధన తీసుకొచ్చాడు.  దీని ప్రకారం  ట్విటర్  యూజర్లు   వెరీఫైడ్  సేవలను పొందాలనుకుంటే  వెబ్ యూజర్లైతే  నెలకు 8 డాలర్లు (సుమారు రూ. 650), ఐఫోన్, ఆండ్రాయిడ్  యూజర్లు నెలకు  11 డాలర్లు (సుమారు  రూ. 900) చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రికెటర్లలో చాలా మంది ట్విటర్ విధించిన గడువులో  సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేదు. దీంతో చాలా మంది క్రికెటర్లు బ్లూ టిక్ కోల్పోయారు. 


 






జాబితా ఇదే.. 


బ్లూటిక్ కోల్పోయిన క్రికెటర్లలో  సచిన్ టెండూల్కర్, ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, డేల్ స్టెయిన్,  క్రిస్ గేల్, దినేశ్ కార్తీక్,  గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి క్రికెటర్లు ఉన్నారు.  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ),  అంతర్జాతీయ  క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా  వెరీఫైడ్  స్టేటస్ ను కోల్పోయాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా  బ్లూటిక్ కోల్పోయాయి. 


వీళ్లకు ఉపశమనం.. 


ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు బ్లూటిక్‌ను కోల్పోగా హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కెవిన్ పీటర్సన్, ఏబీ డివిలియర్స్, సురేశ్ రైనాలకు మాత్రం  బ్లూటిక్ అలాగే ఉంది. వీళ్లు   రుసుము చెల్లించడంతో  ట్విటర్ వీరి ఖాతాలను ముట్టుకోలేదు.  


 






కాగా  టీమిండియా క్రికెటర్ల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ తొలగించడంపై యూజర్లు కూడా మస్క్ (ట్విటర్)కు కౌంటర్ ఇస్తున్నారు.  ‘హే ట్విటర్..  వాళ్లు ఆల్రెడీ  బ్లూ (టీమిండియా డ్రెస్ కోడ్ కలర్) లోనే ఉన్నారు. నువ్వు కొత్తగా  బ్లూ టిక్ తొలగించినంత మాత్రానా వాళ్లకు కొత్తగా కోల్పోయేదేమీ లేదు..’ అని కామెంట్ చేస్తున్నారు.