MS Dhoni  vs SRH in IPL: ఐపీఎల్-2023లో  భాగంగా నేడు చెన్నైలోని చిదంబరం (చెపాక్) స్టేడియంలో  చెన్నై సూపర్ కింగ్స్  - సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య  మరో ఆసక్తికర పోరు జరుగనుంది. శుక్రవారం   రాత్రి 7 నుంచి   చెపాక్ లో  జరుగబోయే  మ్యాచ్‌ కోసం ఇదివరకే ఇరు జట్లు  నేటి  పోరులో అనుసరించే వ్యూహాలకు తుది రూపునిచ్చే పనిలో ఉన్నాయి.  అయితే  సన్ రైజర్స్ హైదరాబాద్‌కు  సీఎస్కే  బ్యాటర్లలోని  రుతురాజ్, కాన్వే, రహానే కంటే కూడా మరో వ్యక్తి కొరకారని కొయ్యగా ఉన్నాడు. అతడు మరెవరో కాదు.  చెన్నై  సారథి మహేంద్రుడే. 


ఘనమైన రికార్డు.. 


సన్ రైజర్స్ పై ధోనికి మంచి రికార్డు ఉంది.  ఐపీఎల్‌లో ఎస్ఆర్‌‌హెచ్‌పై  18  ఇన్నింగ్స్ ఆడితే అందులో ఏకంగా 488 పరుగులు చేశాడు.  18 ఇన్నింగ్స్ లో 488  పరుగులు చేయడం గొప్పా..? అని విమర్శించేవారూ లేకపోలేదు. కానీ ధోని  బ్యాటింగ్ కు వచ్చేది ఆరో స్థానంలో.  ధోని క్రీజులోకి వచ్చేసరికే దాదాపు  15, 16 ఓవర్లు ముగుస్తాయి. ఆడే బంతులు కూడా తక్కువగా ఉంటాయి.  ఆ సమయంలో  వచ్చి  488 పరుగులు సాధించడమనేది మాటలు కాదు.  సన్ రైజర్స్ పై ధోని సగటు  కూడా  48.80 గా ఉండటం గమనార్హం.  


 






ఎస్ఆర్‌‌హెచ్‌పై   ధోని 18 ఇన్నింగ్స్ లలో  488 పరుగులు చేయగా ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 8 సార్లు  నాటౌట్ గా ఉండి తన టీమ్ ను గెలిపించుకున్నాడు. 30 ప్లస్ స్కోర్లు కూడా ఆరు సార్లు చేశాడు.  ఈ క్రమంలో   ధోని స్ట్రైక్ రేట్  సైతం  145.24 గా ఉంది. అత్యధిక స్కోరు 37 బంతుల్లో 67 నాటౌట్ గా ఉంది. మరి నేటి మ్యాచ్‌లో ‘తాలా’ను అడ్డుకోకుంటే  సన్ రైజర్స్ బౌలర్లకు మరోసారి బడిత పూజ తప్పదు. 


అసలే  ధోనికి చివరి సీజన్ గా భావిస్తున్న ఈ ఐపీఎల్‌లో అతడు ఆఖర్లో బ్యాటింగ్ కు వచ్చి సంచలన ఇన్నింగ్స్ లు ఆడాడు. గుజరాత్ టైటాన్స్ తో  మ్యాచ్‌లో ఆడింది ఏడు బంతులైనా ఓ ఫోర్, సిక్సర్ తో 14 రన్స్ చేశాడు. లక్నోతో పోరులో  రెండు బంతులే ఆడి రెండు భారీ సిక్సర్లు బాదాడు.  రాజస్తాన్ రాయల్స్ తో  17 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లు బాది మ్యాచ్ గెలిపించినంత పనిచేశాడు. ఇదే బాదుడు సన్ రైజర్స్ తో కూడా కొనసాగితే అది   హైదరాబాద్‌కు ఇబ్బందే.  అసలే చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ కు దారుణమైన రికార్డుంది. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ లలో  కూడా  ఆరెంజ్ ఆర్మీకి ఓటమి తప్పలేదు.