DC vs KKR: ‘తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా..’ తెలుగులో వెంకటేశ్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఇంచుమించుగా ఐపీఎల్-16లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫీలింగ్ కూడా ఇలాగే ఉంది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత ‘అసలు ఢిల్లీ ఈ సీజన్‌లో బోణీ కొడుతుందా..?’ అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు ఢిల్లీ ఓ విజయాన్ని అందుకుంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి.
మ్యాచ్ ముగిశాక ఢిల్లీ టీమ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇయాన్ బిషప్ తో దాదా మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు బోణీ కొట్టినందుకు సంతోషంగా ఉంది. నేను డగౌట్ లో కూర్చుని మ్యాచ్ గెలిచిన తర్వాత నాకు నా కెరీర్ లో ఫస్ట్ రన్ తీసినట్టు (నవ్వుతూ) అనిపించింది. ఇవాళ మేము అదృష్టవంతులం. విన్నింగ్ టీమ్ గా ఉన్నాం..’అని అన్నాడు. దాదా 1996లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
మా బ్యాటర్లు మారాలి..
మ్యాచ్ గెలిచినా ఢిల్లీ బ్యాటింగ్ చెత్తగా ఉంది. డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడి ఉండకపోయి ఉంటే నిన్న 128 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించడం ఆ జట్టుకు భారంగా ఉండేది. వర్షం తర్వాత స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ పై సాధించాల్సిన 128 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించేందుకు ఢిల్లీ బ్యాటర్లు తడబడ్డారు. ఇదే విషయమై దాదా స్పందిస్తూ.. ‘మేం బాగానే బౌలింగ్ చేస్తున్నాం. కానీ మా బ్యాటింగ్ దారుణంగా ఉంది. ఈ విషయంలో మేం మా లోపాలను సమీక్షించుకోవాల్సి ఉంది. మా టీమ్ లో పృథ్వీ షా, మిచెల్ మార్ష్, మనీష్ పాండే కీలక ప్లేయర్లు. కానీ వాళ్లు ఇంకా ఫామ్ ను అందుకోలేదు. అదే ఆందోళనకరంగా ఉంది..’అని దాదా వ్యాఖ్యానించాడు.
కాగా గురువారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌ను 127కే నిలువరించిన ఢిల్లీ.. తర్వాత లక్ష్య ఛేదనలో తడబడింది. ఒక దశలో ఏడు ఓవర్లలో 61-1 గా ఉండి లక్ష్యం వైపు దూసుకెళ్లిన ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (13) తో పాటు మిచెల్ మార్ష్ (2), ఫిలిప్ సాల్ట్ (5), అమన్ ఖాన్ (0), మనీష్ పాండే (21) లు విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్ (57) నిష్క్రమించిన తర్వాత గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న అక్షర్ పటేల్ (19 నాటౌట్) కేకేఆర్ స్పిన్ త్రయం నితీశ్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్ లు కట్టడి చేసినా చివరి ఓవర్లో ఢిల్లీకి విజయాన్ని అందించాడు.