Mamata Banerjee Jab at BJP:


విమర్శల డోస్ పెరిగింది..


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శల డోస్ పెంచారు. అవకాశం దొరికినప్పుడల్లా ఏదో విషయంలో కేంద్రానికి చురకలు అంటిస్తున్నారు. రంజాన్ వేడుకల సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మరోసారి కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఈ సారి బీజేపీ పేరు నేరుగా ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొందరు దేశాన్ని విడగొట్టేందుకు కుట్ర చేస్తున్నారని, తాను ఉన్నంత వరకూ అది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలందరూ ఓడించాలని పిలుపునిచ్చారు. 


"కొందరు వ్యక్తులు దేశాన్ని విడగొట్టాలని కాచుకు కూర్చున్నారు. విద్వేషాలను పెంచుతూ వాటితో రాజకీయం చేస్తున్నారు. నేను నా ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమే. కానీ దేశాన్ని విడగొట్టే కుట్రల్ని మాత్రం సహించను"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం










బీజేపీ గ్రూప్‌లో కొందరు దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తున్నారని మండి పడ్డారు దీదీ. ఇదే సమయంలో NRCపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల హక్కుల్ని అణిచివేసే అలాంటి చట్టాలను అమలు చేయకుండా తప్పకుండా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. 


"మా రాష్ట్రంలో NRC అమలు కాకుండా తప్పకుండా అడ్డుకుంటాను. పౌరసత్వ సవరణ చట్టంతో పొరుగు దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన మైనార్టీల హక్కుల్ని అణిచివేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పౌరసత్వ చట్టాలు, రికార్డులు చాలు. కొత్తగా ఏమీ అక్కర్లేదు. డబ్బున్న ఆ పార్టీతో (బీజేపీ) పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. దర్యాప్తు సంస్థలనైనా సరే గట్టిగానే ఎదుర్కొంటాం. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు గద్దెనెక్కాలన్నది మీరే (ప్రజలే) నిర్ణయించాలి. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయకుండా చూసే బాధ్యత మనందరిది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోలేకపోతే ఎన్నో కోల్పోతాం"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం


Also Read: US Supreme Court: ఇక అబార్షన్ పిల్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు, తేల్చి చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు