అల్లరి నరేష్ హీరోగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘ఉగ్రం’.  మిర్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. మే 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ‘ఉగ్రం’ ట్రైలర్ రిలీజ్  అయ్యింది.






అవుట్ అండ్ అవుట్ యాక్షన్- ఆకట్టుకుంటున్న ‘ఉగ్రం’ ట్రైలర్‌


‘ఉగ్రం’ ట్రైలర్ పూర్తి స్థాయిలో యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. అంతేకాదు, ఈ ట్రైలర్ లోనే సినిమా కథ ఏంటో చెప్పేశారు మేకర్స్. సిటీలో వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వీటి వెనుక కొంత మంది పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉండటం, వారిని దందాను అంతమొందించేందుకు నిజాయితీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్  చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశంగా ట్రైలర్ లో చెప్పేశారు. ఈ పోరాటంలో పోలీసు అధికారి ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి అనేవి సినిమాలో చూపించనున్నారు.


గతంలో ఎప్పుడూ కనిపించని రూపంలో అల్లరి నరేష్   


ఈ ట్రైలర్ లో నరేష్ ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించారు. పోలీసులు అధికారితో పాటు మరో లుక్ లో ఆకట్టుకున్నాడు. నరేష్ క్యారెక్టర్ ను దర్శకుడు చాలా బాగా ప్రజెంట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. సినిమా సైతం చాలా గ్రాండ్ గా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా ట్రైలర్ కూడా మరింత ఆసక్తిగా ఉండటంతో, సినీ అభిమానులు ఈ చిత్రం మంచి హిట్ కొట్టడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.     


‘నాంది’ తర్వాత ‘ఉగ్రం’


'నాంది' తర్వాత హీరో 'అల్లరి' నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా 'ఉగ్రం'. గతంలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న అల్లరి నరేష్, ‘నాంది’ సినిమాతో కొత్త ట్రాక్ లోకి అడుగు పెట్టారు. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.  విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన 'నాంది'  సినిమా సూపర్ హిట్టయింది. మళ్లీ వీరిద్దరు కలిసి ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు.  హీరోగా నరేష్ 60వ చిత్రమిది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో విజయ్-నరేష్ కాంబినేషన్‌లో మరో హిట్ పడటం ఖాయం అంటున్నరు అభిమానులు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో 'ఉగ్రం' చిత్రం రూపొందుతోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు.



Read Also: 'విరూపాక్ష' సూపర్ హిట్ - మేనల్లుడికి చిరు, పవన్ అభినందనలు