Hyderabad News: గుండీలు, సబ్బు బిళ్లలు, హ్యాండ్ బ్యాగు అంచులు... ఇలా అన్నింటిలో డ్రగ్స్ పొడిని పెట్టి అక్రమంగా హైదరాబాద్ తీసుకు రావాలనుకుంది. సినిమాలు చూసి ఈ తెలివి నేర్చుకుందా.. లేక మరెవరైనా ఈమెకు అలా చేయమని చెప్పారో తెలియదు కానీ అద్భుతమైన ప్లాన్ వేసి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంది. చివరకు పోలీసులకు చిక్కి ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.14.2 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను సదరు మహిళ నుంచి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. రాష్ట్రంలోకి ముఖ్యంగా హైదరాబాద్‌లోకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. ఏదో రకంగా డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది.
నైరోబీ నుంచి షార్జా మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిందో మహిళ. అయితే బురుండీ దేశానికి చెందిన 43 ఏళ్ల మహిళ ఎయిర్ అరేబియా ఎయిర్ వేస్ విమానం జీ9458లో ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే మహిళ పద్ధతి కాస్త తేడాగా, భయంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమెను పక్కకు పిలిచి ఆమె లగేజీని తనిఖీ చేశారు. ఓ సంచిలో ఆఫ్రికా సంప్రదాయ దుస్తులు ఎనిమిది, మూడు సబ్బులు, ఒక హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి.
ఇంత సింపుల్ లగేజీతో వచ్చిన ఆమె ఎందుకు కాస్త కంగారుగా భయంతో ఉందని అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె లగేజీని కాస్త నిశితంగా పరిశీలించగా అధికారులు షాక్ కు గురయ్యారు. ఆఫ్రికా సంప్రదాయ దుస్తులకు ఉన్న పెద్ద పెద్ద గుండీల్లో, సబ్బుల మధ్య ప్లాస్టిక్ కవర్ లో, హ్యాండ్ బ్యాగ్ అంచుల్లో హెరాయిన్ ఉన్నట్లు అర్థం అయింది. అయితే పౌడర్ రూపంలో ఉన్న హెరాయిన్ ను పొట్లాల్లో పెట్టి.. వాటిని గుండీలు, సబ్బులు, హ్యాండ్ బ్యాగ్ అంచుల్లో అమర్చినట్లు గుర్తించారు. 2.27 కిలోల ఆ హెరాయిన్ విలువ మార్కెచ్ ధర ప్రకారం రూ.14.2 కోట్లు ఉంటుందని అధికారులుల చెబుతున్నారు.
అయితే అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకున్న మహిళపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు... ఆ మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ను హైదరాబాద్ కు పంపింది ఎవరు, ఇక్కడ వాటిని తీసుకునేది ఎవరు అనే దానిపై కస్టమ్స్ అధికారులు దృష్టి సారించారు. కస్టమ్స్ అధికారులే కాకుండా రాష్ట్ర పోలీసులు కూడా మహిళ డ్రగ్స్ ను ఎవరికి అందజేసేందుకు తీసుకు వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: క్లినిక్‌లో డైమండ్ రింగ్ చోరీ, దొరికిపోతాననే భయంతో డాక్టర్ ఏం చేశారంటే?
Also Read: బ్రేకప్ చెప్పిందని గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేసిన టీనేజర్, గన్‌తో ఐదు రౌండ్ల కాల్పులు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial