Hyderabad News: స్కిన్ చికిత్స కోసం ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె బ్రేస్ లెట్, ఉంగరం తీసివేయాలని వైద్యురాలు సూచించింది. చికిత్స అనంతరం బాధితురాలు వాటిని మర్చిపోయి వెళ్లగా.. వైద్యురాలు వాటిని దొంగిలించింది. బాధిత మహిళ మళ్లీ వచ్చి అడగ్గా తమకేం తెలియదంటూ బుకాయించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారించారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడ దొరికిపోతానన్న భయంతో వైద్యురాలే ఉంగరాన్ని టాయ్ లెట్ లో పడేసిందని గుర్తించారు. చివరకు టాయ్ లెట్లను పగులగొట్టి మరీ 85 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ రింగ్ ను బయటకు తీశారు. 


అసలేం జరిగిందంటే..?


బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నివసించే ఓ ప్రముఖ వ్యాపారి నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు తనిష్క అగర్వాల్ గతనెల 23వ తేదీన.. స్కిన్ ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్లారు. జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్ సమీపంలోని ఎఫ్ఎంఎస్ స్కిన్ అండ్ డెంటల్ క్లినిక్ కు చికిత్స కోసం వెళ్లారు. అయితే చికిత్స సమయంలో చేతికి ఉన్న ఉంగరంతోపాటు బ్రాస్ లేట్ తొలగించాలని స్కిన్ థెరపిస్ట్ లాలస ఆమెకు సూచించారు. దీంతో తనిష్క తన వేలికి ఉన్న రూ.85 లక్షల రూపాయల విలువ చేసే ఉంగరాన్ని, బ్రేస్ లెట్ ను సిబ్బందికి ఇచ్చింది. అనంతరం చికిత్స తీసుకున్నారు. వెంటనే ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఇంటికి చేరుకున్న తర్వాత ఆమెకు ఉంగరం, బ్రేస్ లెట్ అక్కడే మర్చిపోయినట్లు గుర్తుకు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు.  


అయితే అక్కడకు వెళ్లి ఉంగరం, బ్రేస్ లెట్ గురించి అడగ్గా.. తమకేం తెలియదని వైద్యులు, సిబ్బంది బుకాయించారు. దీంతో తనిష్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని సిబ్బందిని విచారించారు. రెండ్రోజుల పాటు విచారించినా.. వాళ్లు ఏమీ చెప్పలేదు. కానీ తమదైన స్టైల్ లో విచారించాక స్కిన్ థెరపిస్ట్ లాలస తన తప్పును ఒప్పుకుంది. తానే ఆ ఉంగరం, బ్రేస్ లెట్ ను దాచిపెట్టానని.. కానీ తనిష్క పోలీసులకు ఫిర్యాదు చేయగానే.. దాన్ని క్లినిక్ లోని టాయ్ లెట్ లో పడేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు క్లినిక్ లోని రెండు బాత్రూమ్ ల టాయ్ లెట్లను పగులగొట్టారు. డ్రైనేజీలో మొత్తం వెతికించి.. ఉంగరాన్ని గుర్తించారు. వెంటనే దీన్ని బాధితురాలికి అప్పగించి, నిందితురాలు లాలసను అరెస్ట్ చేశారు. 


ఇటీవలే కరీంనగర్ లో మొబైల్ ఫోన్ స్వాధీనం..


కరీనంగర్ జిల్లా కేంద్రంలోని బస్టాంబ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ కు వీణవంక మండలం దేశాయిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మణ్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు టిఫిన్ చేశారు. అనంతరం బిల్లు కట్టేందుకు కౌంటర్ వద్దకు వెళ్లగా.. ఓ వ్యక్తి వచ్చి తన పక్కనే నిలుచున్నాడు. చేతిలో పాలిథిన్ కవర్ పట్టుకొని మెల్లిగా లక్ష్మణ్ జేబులో ఉన్న ఫోన్ ను చోరీ చేశాడు. అయితే తనకు కవర్ తగిలిందనుకున్నాడు. కానీ ఫోన్ చోరీ జరిగిందని లక్ష్మణ్ కు తెలియలేదు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఫోన్ పోయిందని గుర్తించిన వ్యక్తి.. హోటల్ సిబ్బందికి చెప్పాడు. సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించి.. ఓసారి చూపించమని కోరారు. ఈక్రమంలోనే తన ఫోన్ కొట్టేసిన వ్యక్తిని గుర్తించారు.  హోటల్ సిబ్బందిని అడిగి సీసీటీవీ ఫుటేజీ వీడియో తీసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.