అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిఐగా పని చేస్తున్న ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని తనువు చాలించారు. ఈ ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పని ఒత్తిడే కారణమని ప్యామిలీ అంటుంటే... రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయనే వాదన వినిపిస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 


సీఐ ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రి చేరుకున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఆనందరావు ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా చెప్పారు. ఆయనపై ఎలాంటి పని ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. 


ఫ్యామిలీ మాత్రం ఆనందరావు మృతికి పని ఒత్తిడే కారణమని చెబుతున్నారు. ఆనందరావు కుమార్తె మాట్లాడుతూ.. తన తండ్రి ఎప్పటి నుంచో పని ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు. గతంలో చాలా ప్రాంతాల్లో పని చేసినా ఇలాంటి పరిస్థితిలేదని అన్నారు. గత కొద్ది రోజులుగా చాలా ప్రెజర్‌కు లోనైనట్టు తెలియజేశారు. ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నట్టు తరచూ చెప్పేవారని కుమార్తె వివరించారు. 
చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన సీఐ గతంలో చాలా ప్రాంతాల్లో పని చేశారు. తిరుపతి, కడపలో కూడా పని చేశారు. గత సెప్టెంబ్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు.