భర్త పోయిన పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమెకు సైబర్ కేటుగాళ్లు కోలుకోలేని దెబ్బ తీశారు. అవగాహన లేమితో ఆమె చేసిన పని చివరికి రూ.లక్షల సొమ్మును కోల్పోయేలా చేసింది. కొత్త రకం వెబ్‌సైట్‌లు, ప్రాచుర్యం పొందని వెబ్ సైట్ల ద్వారా ఉత్పత్తులు కొంటే ఎలాంటి పరిస్థితులు ఎదురు కావొచ్చో అప్రమత్తం చేసే ఘటన ఇది. ఎప్పుడూ నేరాల్లో కొత్త పుంతలు తొక్కే సైబర్ కేటుగాళ్లు అలాంటి పద్ధతిలోనే ఓ మహిళ నుంచి రూ.లక్షల సొమ్మును కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాలివీ..
మౌలాలీలో ఉండే ఓ వ్యక్తి(32) లేబర్ కాంట్రాక్టర్‌గా పని చేస్తుండేవారు. ఈయన గతేడాది నవంబర్‌లో కరోనా కారణంగా చనిపోయారు. అప్పటికే ఆయన పేరుపై ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ సొమ్ము సదరు కంపెనీ ఆయన భార్యకు వచ్చేలా చేసింది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కుటుంబానికి రూ.50 లక్షలు అందాయి. వారికి ముగ్గురు పిల్లలు ఉండడంతో వారి పేరుపై ఆయన భార్య తలా రూ.10 లక్షల చొప్పున బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. తన దగ్గరున్న, మిగతా డబ్బును రెండు బ్యాంకు అకౌంట్లలో వేసింది. ఇలా ఒక అకౌంట్‌లో రూ.28 లక్షలు, మరో అకౌంట్‌లో రూ.5 లక్షలు వేసింది. 8వ తరగతి చదువుతున్న తన కుమార్తె ఆన్‌లైన్ క్లాసులను వినేందుకు ఇయర్ ఫోన్స్ కావాలని అడగడంతో ఓ వెబ్‌సైట్‌లో రూ.99కే ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసింది. వస్తువు హోం డెలివరీ అయింది.
15 రోజుల్లో డబ్బులు మొత్తం ఖాళీ..
కొన్ని రోజుల తర్వాత ఆమె మరికొంత డబ్బును జమ చేసేందుకు బ్యాంక్‌కి వెళ్లారు. బ్యాలెన్స్ చెక్ చేయగా.. జీరో బ్యాలెన్స్ చూపించింది. రూ.5 లక్షలుండాలని ప్రశ్నించగా.. తమకేం తెలియదంటూ సిబ్బంది వివరించారు. మరో ఖాతాలో రూ.28 లక్షలుండగా.. ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదని తెలుసుకుని కంగుతిన్నది. వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించగా, ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్ కేటుగాళ్లకు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు.
Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..
ఏం జరిగిందంటే..
ఇయర్ ఫోన్స్ ఇంటికి డెలివరీ అయ్యాక కొద్ది రోజులకు లాటరీ తగిలిందని ఆ వెబ్‌సైట్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. రూ.15 లక్షల విలువ చేసే కారును గెలుచుకున్నారని.. కారు వద్దనుకుంటే డబ్బు తీసుకోవచ్చని చెప్పాడు. ఫోన్‌కి వచ్చిన ఎస్‌ఎంఎస్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి బహుమతి డబ్బును జమ చేసేందుకు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని సూచించాడు. సైబర్ నేరస్థులు చెప్పినట్లుగా బాధితురాలి కుమార్తె ఎనీ డెస్క్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసింది. బ్యాంక్, డెబిట్ కార్డులు, ఓటీపీ ఇతరత్రా వివరాలను చెప్పింది. ఈ సమాచారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకుని ముందుగా ఫోన్ నంబర్ మార్చేశారు. గూగుల్ పే, ఫోన్ పేను తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని వేర్వేరు అకౌంట్లకు డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా గుర్తించారు. అయితే, ఈ సైబర్ దందా మొత్తం బిహార్ కేంద్రంగా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకొనే పనిలో పోలీసులు ఉన్నారు.
Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్
Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..