అమీర్ పేట్‌లో ఓ యువకుడిపై హత్య యత్నం జరిగింది. ఏకంగా స్నేహితులే అతనిపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్యాయత్నం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం నాడు ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాల ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, తీవ్రంగా గాయపడిన అతణ్ని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


ఎస్ ఆర్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాత కక్షల కారణంగానే యువకుడిపై స్నేహితులు హత్యాయత్నం చేశారు. ఎర్రగడ్డ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ మానసిక వైద్యశాల ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ అలియాస్‌ ఆదిల్‌ అలియాస్‌ సాయికుమార్‌ అనే 24 ఏళ్ల యువకుడిపై అతని స్నేహితులు మహమ్మద్‌ అనే 30 ఏళ్ల వ్యక్తి, 25 ఏళ్ల అజర్‌‌లు పెట్రోలు పోశారు. అనంతరం నిప్పంటించారు. ఈ విషం గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన ఆదిల్‌‌ను ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతణ్ణి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


కృష్ణానగర్‌కు చెందిన ఆదిల్‌ ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గతంలో అతనిపై నగరంలో దొంగతనం కేసులు మూడు నమోదై ఉన్నాయి. గతంలో ఆ చోరీ కేసులకు సంబంధించి పోలీసుల విచారణలో మహమ్మద్‌ మేనల్లుడైన సోహైల్‌ పేరును ఆదిల్‌ బయటపెట్టాడు. దీంతో అతని పేరును బయట పెట్టినందుకు కక్ష పెంచుకున్న మహమ్మద్‌, అజర్‌తో కలిసి అదిల్‌ను అంతం చేయాలని పథకం రచించాడు. 


అలా వారు వేసుకున్న పథకం ప్రకారమే.. ఆదిల్‌ను శుక్రవారం సాయంత్రం ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల సమీపానికి తీసుకెళ్లారు. అజర్‌ అతనిపై పెట్రోల్‌ పోయగా మహమ్మద్‌ లైటర్‌తో నిప్పుపెట్టాడు. అనంతరం ఇద్దరూ పారిపోయారు. దీంతో మంటల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఆదిల్‌ను మానసిక ఆసుపత్రి సిబ్బంది గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 


అతనికి ప్రస్తుతం 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసుకున్న SR నగర్‌ పోలీసులు శనివారం నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.


Also Read: Warangal News : బాలికను గర్భవతి చేసిన సర్పంచ్, పోలీసు కేసు పెట్టకుండా గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు


Also Read: ఏపీ హైకోర్టు లాయర్ ఆవుల వెంకటేశ్వర్లు అనుమానాస్పద మృతి, హత్య అని కుటుంబసభ్యులు అనుమానం