రక్తంలో హిమోగ్లోబిన్ ఒక భాగం. రక్తంలోని ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్త హీనత సమస్య వస్తుంది. దీన్ని అనిమియా అంటారు. ఈ ఆరోగ్య సమస్య శరీరాన్ని కుంగదీస్తుంది. శక్తిహీనంగా మారుస్తుంది. అందుకే హిమోగ్లోబిన్ తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం. ఉంది. హిమోగ్లోబిన్ ను కలిగి ఉంటే ఎర్ర రక్త కణాల జీవిలం కాలం 100 నుంచి 120 రోజులు. ఆ తరువాత అవి నశించిపోతాయి. ఈలోపు ఎముక మజ్జలో ఎర్రరక్తకణాల ఉత్పత్తి జరుగుతుంది. పాతవి నశించేలోపు కొత్తవి పుట్టుకొస్తాయి. ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం వల్లే అవి ఎర్రగా కనిపిస్తాయి. శరీరంలోని అవయవాలకు, కణాలకు ఆక్సిజన్ అందించే పని కూడా హిమోగ్లోబిన్‌దే. హిమోగ్లోబిన్ లోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇనుము అందితే...
హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అత్యవసరమైనది ఇనుము. మీరు తినే ఆహారంలో ఇనుము నిండిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, బీన్స్, కాలే, బ్రకోలీ, చేపలు, చికెన్, నట్స్, ఉసిరి, గుడ్లు, పప్పులు, మెంతి ఆకులు, రాగులు,సజ్జల్లో ఇనుము పుష్కలంగా లభిస్తుంది.
ఫోలెట్ ఉండే ఆహారం
హిమోగ్లోబిన్లో ఉండే హీమ్ ఉత్పత్తికి ఫోలేట్, విటమిన్ బి కూడా అవసరం పడతాయి. ఫోలేట్, విటమిన్ బి ఎర్ర రక్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శరీరంలో హీమ్ ఉత్పత్తి అయ్యేందుకు క్యాబేజీ, చికెన్ లివర్, టోఫు, పనీర్ వంటివి అధికంగా తినాలి.
ఇనుము శోషణ సరిగా ఉండేలా
కొన్ని పదార్థాలు శరీరంలో ఇనుము శోషణను పెంచుతాయి, మరికొన్ని తగ్గిస్తాయి. శరీరంలో ఇనుము శోషణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇనుము శోషణను తగ్గించే గుణం కాల్షియానికి ఉంది. అందుకే ఇనుము నిండుగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, కాఫీ, టీ, పెరుగు వంటివి తినకుండా గ్యాప్ ఇవ్వాలి. కానీ చాలా మందికి భోజనం తిన్న వెంటనే కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. దాన్ని వదులుకోవాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
ఎంత తింటున్నా రక్త హీనత సమస్య పోకపోయినా, హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతున్నా... అది అంతర్లీనంగా వేరే ఆరోగ్యసమస్యలకు సంకేతం కావచ్చు. అలాంటప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
సప్లిమెంట్లు
ఐరన్ సప్లిమెంట్లు ఎవరికి వారు కొనుక్కుని వేసుకోకూడదు. వైద్యుడి సూచన మేరకే వినియోగించాలి. కేవలం సప్లిమెంట్లతోనే ఇనుము పెరుగుతుందనుకోవద్దు, వాటిని వాడుతూ ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తింటే త్వరగా లోపాన్ని అధిగమించవచ్చు.
Also read: బతికుంటే బలుసాకు తినొచ్చంటారు, ఏంటీ బలుసాకు? ఎందుకలా అంటారు?
Also read: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి