సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంప్రదాయాలను, జీవనాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. సామెతలను లోకోక్తులు అని కూడా అంటారు. అనుభవ సారాలతోనే సామెతలు పుట్టాయని చెప్పుకోవచ్చు. మాటల మధ్యలో సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినంత తియ్యగా ఉంటాయని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు చాలా మందికి తెలుగు సామెతలు తెలియవు. ఆధునిక కాలంలో ఆంగ్ల వాడకం ఎక్కువయ్యాక ఏవి సామెతలో, వాటిని ఎందుకు వాడతారో కూడా తెలియకుండా పోయింది. కరోనా వచ్చాక బాగా వినిపించిన సామెత ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అని. లాక్‌డౌన్ సమయంలో సీఎం కేసీఆర్ కూడా ఈ సామెతను వాడారు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో దీన్ని వాడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సామెతల వాడకం ఇంకా ఉంది.
ఏంటి బలుసాకు?
తెలుగు సామెతల్లో అధికంగా వాడే వాటిలో ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’, ‘బతికుంటే బలుసాకు అమ్ముకుని బతకొచ్చు’ అనేవి. ఈ రెండింటిలో వాడిన బలుసాకు గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. అది కూడా గ్రామాల్లోని వారికి తప్ప ఆధునిక యువతకు, నగర జీవులకు తెలిసేది తక్కువే. ఆ ఆకు గొప్పతనం వల్లే రెండు సామెతలు పుట్టాయి. ఆ ఆకులు మన పూర్వీకులకి ఎంతగా ఉపయోగపడ్డాయో, సామెతలను చూస్తే అర్ధమైపోతుంది. బలుసాకు అనేది ఒక ముళ్ల మొక్క పేరు. కంపచెట్టులా కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామం ‘వెబెరా టెట్రాండ్రా - కాంథియం పార్విఫ్లోరమ్’ అంటారు. ఎన్నో ఔషధగుణాలున్న మొక్క ఇది. సంసృతంలో ఈ మొక్కని బారదాజి, బలాక అని పిలుస్తారని చెబుతారు.
ఆకు వల్ల ఎన్నో లాభాలు
ఈ ఆకుల్లో ఔషధ గుణాలు అధికం. పూర్వం అతిసారానికి మందుగా వాడేవారు. ఈ ఆకుల్నించి సారాన్ని తీసి కషాయం చేసేవారు. అది ఎన్నో రోగాలను తగ్గించే గుణాల కలది. ఈ ఆకుల్లో ఇనుము కూడా అధికంగా ఉంటుంది. అందుకే అప్పట్లో ఆకులను వంటల్లో కూడా వాడేవారట. పచ్చడి చేసుకునేవారట. జ్వరాన్ని, పైత్యాన్ని తగ్గించే లక్షాలు ఇందులో ఉండేవట. ఈ ఆకు రుచి కాస్త వగరుగా ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం ప్రజలు తినేవారని చెబుతారు.అనారోగ్య పరిస్థితుల్లో పథ్యం పాటించాల్సి వచ్చినప్పుడు బలుసాకు వంటలను లాగించేవారు. అందుకే బతికుంటే బలుసాకు తిని బతకచ్చు అని సామెత పుట్టినట్టు వాదన ఉంది. వందేళ్ల క్రితం పశువులే ప్రజలకు జీవనోపాధిగా ఉండేది. వాటి రోగాలకు కూడా బలుసాకును వాడే వారు. గౌట్ ఆర్థరైటిస్ కు చెక్ పెట్టే లక్షణాలు దీనిలో ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ ఆకు వాడకం ఎక్కువే. అజీర్తిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది. మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. బలుసు మొక్కకి చిన్న చిన్న పండ్లు కాస్తాయి. వాటిని కూడా వైద్యంలో వాడేవారు. ఆ ఆకులను పచ్చివి నమిలి తినేవారట. నేరుగా తినలేని వారు వండుకుని, పచ్చడి చేసుకుని తినేవారు. ఎంత కష్టకాలం వచ్చినా బతకాలన్న ఆశ ఉండాలని చెప్పేందుకు కూడా ఈ సామెతను వాడుతారు.
Also read: శ్రీరామనవమికి పానకం, వడపప్పు, వేసవి తాపానికి చెక్ పెట్టే సూపర్‌ఫుడ్స్ ఇవి