కేంద్రప్రభుత్వం ఇకపై రేషన్లో భాగంగా పేదలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్రకేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. దాదాపు ఏడాదికి రూ.2700కోట్లు దాకా రైస్ ఫోర్టిఫికేషన్ కోసం ఖర్చవుతుంది. ఈ ఫోర్టిఫికేషన్ బియ్యం మహిళలకు, పిల్లలకు, పాలిచ్చే తల్లులకు చాలా అవసరమని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. వారికోసమే ప్యతేకంగా రేషన్లో వీటి పంపణీని మొదలుపెట్టబోతున్నారు.  


 ఫోర్టిఫైడ్ బియ్యం అంటే?
మనదేశంలో చాలా మంది పేదలకు సరైన ఆహారం లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో ఎంతో మంది పిల్లలు, బాలింతలు ఉన్నారు. వారి పోషకాహారాలోపాన్ని తీర్చేందుకు బియ్యాన్ని ఫోర్టిఫికేషన్ చేసి ఇవ్వబోతున్నారు. అంటే సాధారణ బియ్యానికే ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, వంటి పోషకాలను జోడించే పక్రియే ఫోర్టిఫికేషన్. ఆ బియ్యాన్ని తినడం వల్ల పోషకాహారలోపం తలెత్తదు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 


పోషకాహారలోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. వారిలో రక్తహీనత సమస్యకు దారి తీస్తుంది. మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ప్రపంచఆరోగ్య సంస్థ మహిళలు, పిల్లల్లో రక్తహీనత సమస్య తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ప్రకటించింది. అన్ని దేశాలు తక్షణమే శ్రద్ద వహించాలని చెప్పింది. ఇనుము, విటమిన్ బి12, విటమిన్ ఎ, ఫోలేట్ ఆమ్లం, జింక్ వంటి పోషకాలు లోపించడం కూడా రక్తహీనత సమస్యకు దారి తీస్తుంది. ఇప్పుడు ఫోర్టిఫైడ్ బియ్యం ఆ లోపాన్ని తీర్చనుంది. 


ఉప్పుకు అయోడిన్
గతంలో సాధారణ ఉప్పుకు అయోడిన్ జోడించడం ద్వారా ఉప్పును ఫోర్టిఫైడ్ చేసింది ప్రభుత్వం. 1980లలో ఉప్పులో అయోడిన్ ను తప్పనిసరిగా ఉండాలని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ తరువాత వంటనూనెలు, పాలు, గోధుములను కూడా ఫోర్టిఫికేషన్ పద్ధతిలో అందిస్తోంది.మళ్లీ ఇప్పుడు బియ్యాన్ని ఫోర్టిఫైడ్ చేయబోతోంది ప్రభుత్వం. 


45 రోజుల్లో తినేయాలి
ఫోర్టిఫికేషన్ అనేది ఆహారంలో పోషక నాణ్యతను పెంచే ప్రక్రియ. అయితే ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల వాటిలోని పోషకాలు పోయే ప్రమాదం ఉంది. ఆ బియ్యాన్ని ఫోర్టిఫికేషన్ చేసిన 45 రోజుల్లో తినేయాలి. అధికంగా నిల్వ ఉంచి తినడం సాధారణ బియ్యంతో సమానంగా మారుతాయి. కాబట్టి రేషన్ షాపు నుంచి తెచ్చుకున్న నెలరోజుల్లోనే ఆ బియ్యాన్ని వండుకుని తినేయాలి. చంటిపిల్లలకు జావలా చేసి పెట్టాలి.



Also read: ఏప్రిల్‌లో పుట్టినవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా


Also read: శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం, ఇలా రెండు రకాలుగా చేసుకోవచ్చు