ఐపీఎల్‌లో శుక్రవారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చివరి రెండు బంతుల్లో 12 బంతులు చేయాల్సిన దశలో రాహుల్ టెవాటియా రెండు సిక్సర్లు కొట్టి గుజరాత్‌ను గెలిపించడం విశేషం.


మళ్లీ అదరగొట్టిన లివింగ్‌స్టన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో ఐదు ఓవర్ల లోపే అవుటయ్యారు. వీరు అవుటయ్యే సరికి జట్టు స్కోరు 34 పరుగులు మాత్రమే.


అనంతరం శిఖర్ ధావన్ (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ఫాంలో ఉన్న లియాం లివింగ్ స్టోన్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు. ముఖ్యంగా లియాం లివింగ్ స్టోన్ సిక్సర్లతో చెలరేగిపోయాడు. దీంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 86 పరుగులకు చేరుకుంది. అయితే 11వ ఓవర్ తొలి బంతికే శిఖర్ ధావన్‌ను అవుట్ చేసి రషీద్ ఖాన్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు.


ఈ దశలో లియాం లివింగ్‌స్టోన్‌తో జితేష్ శర్మ (23: 11 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) జత కలిశాడు. వీరిద్దరూ కేవలం 18 బంతుల్లోనే 38 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని అందించారు. రాహుల్ టెవాటియా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ సహా 24 పరుగులను వీరిద్దరూ సాధించారు. అయితే 14వ ఓవర్ మొదటి బంతికి జితేష్ శర్మను, రెండో బంతికి ఒడియన్ స్మిత్‌ను (0: 1 బంతి) అవుట్ చేసి యువ బౌలర్ దర్శన్ గుజరాత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు.


ఇన్నింగ్స్‌లో వేగం పెంచే ప్రయత్నంలో లివింగ్‌స్టోన్, షారుక్ ఖాన్ (15: 8 బంతుల్లో, రెండు సిక్సర్లు)... రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో అవుటయ్యారు. దీంతో ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. ఆ తర్వాత కగిసో రబడ (1: 1 బంతి) కూడా రనౌటయ్యాడు. ఆ తర్వాత కూడా పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చివరి వికెట్‌కు రాహుల్ చాహర్ (22 నాటౌట్: 14 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), అర్ష్‌దీప్ సింగ్ (10 నాటౌట్: ఐదు బంతుల్లో, ఒక ఫోర్) అభేద్యంగా 13 బంతుల్లోనే 27 పరుగులు చేయడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది.


షాకిచ్చిన టెవాటియా
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ మాథ్యూ వేడ్ వైఫల్యాల పరంపర ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (96: 59 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), కొత్త ఆటగాడు సాయి సుదర్శన్ (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి పంజాబ్ 53 పరుగులు చేసింది.


ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఏమాత్రం తడబడకుండా ఆడారు. వీరు దూకుడుగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 94-1కు చేరుకుంది. ఈ లోపే శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సుదర్శన్ అవుటయ్యాడు.


అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టం అయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో 19వ ఓవర్లో సెంచరీ ముంగిట శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. చివరి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కోల్పోయాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన దశలో రాహుల్ టెవాటియా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.