పాకిస్థాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓటు వేశారు. దీంతో ఆయన తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వం కచ్చితంగా అమెరికాకు బానిస ప్రభుత్వం అయి ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ కొన్ని రోజులుగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 


తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసిన ఆయన ప్రధానమంత్రి హోదాలో జాతి నుద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. కొత్త ప్రభుత్వాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు. అది కచ్చితంగా అగ్రరాజ్యానికి తొత్తులా మారుతుందని, అందుకే కొత్తగా ఏర్పడే ప్రభుత్వాన్ని తాను అంగీకరించేది లేదన్నారు ఇమ్రాన్ ఖాన్. 


నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. 
342 మంది సభ్యులున్న పాక్‌ జాతీయ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ రావాలంటే 172 సీట్లు ఉండాలి. అవిశ్వాస తీర్మానంలో 174 ఓట్లు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా రావడంతో ఆయన ఓటమిపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత తీర్మానానికి అనుకూలంగా 174 మంది మద్దతు పలకడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు. 


మళ్లీ అధికారంలోకి వస్తామని ఇమ్రాన్ ధీమా.. 
తన ప్రభుత్వం పడిపోయిన తర్వాత సాయంత్రానికి మద్దతుదారులతో భారీ ర్యాలీ ప్లాన్ చేశారు ఇమ్రాన్ ఖాన్. శాంతియుతంగా ఈ ర్యాలీ చేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు. ఇందులో ఎలాంటి హింసకు తావు ఉండొద్దని సూచించారు. తన పోరాటానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ప్రధానమంత్రి పదవి కోల్పోయిన తర్వాత వీధిన పడతానని తెలుసు అన్న ఇమ్రాన్‌ఖాన్... కచ్చితంగా ప్రజల మద్దతుతో మళ్లీ పదవి చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకే ఇది సాధ్యమని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామంటే కోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 


పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని వీగిపోయిన తొలి ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. 342 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో 172 కంటే ఎక్కువ మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. కానీ ఓటింగ్‌కు ముందే భారీ సంఖ్యలో ఇమ్రాన్‌ ఖాన్ వ్యతిరేకులు ఒక్కచోట చేరారు. దీంతో ప్రభుత్వం కూలిపోతుందని ముందే ఖరారైపోయింది.  


అవిశ్వాసం ఎదుర్కోకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ ప్లాన్ చేశారు. డిప్యూటీ స్పీకర్‌తో అవిస్వాసం చెల్లదని చెప్పించారు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించారు ఇమ్రాన్‌. కానీ విపక్షాలు కోర్టును ఆశ్రయించడంతో కథ అడ్డం తిరింగి. 







ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం తిరస్కరిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవంగా కొట్టివేసింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. పార్లమెంటును రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అవిశ్వాసం నిర్వహించేందుకు ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీ సమావేశ పరచాలని ఆదేశించింది.