MS Dhoni lead team to win title after 4 straight defeats in 2010: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) తాజా సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఐపీఎల్ 2022లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన తొలి జట్టుగా అపప్రథను మూటగట్టుకుంది రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కే. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై జట్టుపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. 4 సార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన సీఎస్కే తాజా సీజన్‌లో దారుణ ప్రదర్శన కొనసాగిస్తోంది.


ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే తొలిసారి...
గతంలో సీఎస్కే జట్టు ఓ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. కానీ సీజన్‌లో తొలి 4 మ్యాచ్‌లు వరుసగా ఓడటం చెన్నై జట్టుకిదే తొలిసారి. 2010లో ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది కానీ అవి సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లు కాదు. ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితి చెన్నైకి ఎదురైంది. ధోనీ తరువాత తొలిసారి సీఎస్కే జట్టు జడేజా కెప్టెన్సీలో బరిలోకి దిగింది కానీ ఆశించిన ఫలితాలు సాధించడం లేదని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇదే సీజన్‌లో 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ సైతం వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమి చెందడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 


హిసర్టీ రిపీట్ అవుతుందా..
సీఎస్కే జట్టు తొలిసారి 2010 సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఆ సీజన్‌లో ఓ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది సీఎస్కే. దాంతో జట్టు పనైపోయిందని అంతా భావించిన సమయంలో సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం 4 వరుస మ్యాచ్‌లు ఓడిన తమ జట్టు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని నెగ్గి ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ టైటిల్స్ రికార్డును సమం చేస్తుందని సీఎస్కే ఫ్యాన్స్, నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 






ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని సీజన్‌లో గెలుపు బోణీ కొట్టింది. అంతకు ముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. మొయిన్‌ అలీ (48; 35 బంతుల్లో 3x4, 2x6), అంబటి రాయుడు (27; 27 బంతుల్లో 4x4) మాత్రమే రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 154 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యమే అయినా సన్‌రైజర్స్ విజయంపై అభిమానులకు సందేహమే. కానీ అభిషేక్‌ శర్మ (75; 50 బంతుల్లో 5x4, 3x6) క్లాసిక్ హాఫ్ సెంచరీకి కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (32; 40 బంతుల్లో 2x4, 1x6) , రాహుల్‌ త్రిపాఠి (39*; 15 బంతుల్లో 4x4, 2x6) ఇన్నింగ్స్ తోడు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో సీఎస్‌కేను ఓడించింది. 
Also Read: IPL 2022 SRH vs CSK Memes: ఓ వైపు CSK బాధపడుతోంటే! మరోవైపు మీమర్స్‌ ఏమో!!


Also Read: RCB vs MI, Match Highlights: ఆగని ముంబై ఓటముల పరంపర - బెంగళూరుపై ఏడు వికెట్లతో ఓటమి - రోహిత్ సేనకు వరుసగా నాలుగో పరాజయం!