ఐపీఎల్‌ 2022 సీజన్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఒకవైపు జట్టు సమతూకం దొరక్క, దీపక్‌ చాహర్‌ లేక, సురేశ్‌ రైనాను తీసుకోక సీఎస్‌కే ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడిలా వరుస ఓటములు ఎదురవ్వడంతో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. మరోవైపు మీమర్లు మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. సన్‌రైజర్స్‌ కుర్రాడు అభిషేక్‌ శర్మ వీర బాదుడు బాదేసి జట్టుకు విజయం అందించాడు.


CSK vs SRH మ్యాచ్‌ ఎలా సాగిందంటే


CSK vs SRH, Match Highlights:హమ్మయ్య! సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) ఎట్టకేలకు నవ్వింది. ఓ అద్భుతమైన విజయాన్ని ముద్దాడింది. అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు మొలిపించింది. తొలి రెండు మ్యాచుల్లో విఫలమై.. ఎందుకు తీసుకుంటున్నార్రా బాబూ అనిపించిన అభిషేక్‌ శర్మ (75; 50 బంతుల్లో 5x4, 3x6) ఆడితే ఇలా ఆడాలి అన్నట్టుగా విరుచుకుపడ్డాడు. ఎడమచేతి వాటంతో క్లాస్‌ చూపించాడు. తిరుగులేని హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. అతడికి తోడుగా కేన్‌ విలియమ్సన్‌ (32; 40 బంతుల్లో 2x4, 1x6) , రాహుల్‌ త్రిపాఠి (39*; 15 బంతుల్లో 4x4, 2x6) రాణించడంతో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో సీఎస్‌కేను ఓడించింది. అంతకు ముందు మొయిన్‌ అలీ (48; 35 బంతుల్లో 3x4, 2x6), అంబటి రాయుడు (27; 27 బంతుల్లో 4x4) ఆడటంతో చెన్నై 154 పరుగులు చేసింది.


షేక్‌ చేసిన అభిషేక్‌


పాపం సీఎస్‌కే! ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా వరుసగా నాలుగో మ్యాచులో పరాజయం చవిచూసింది. తక్కువ స్కోరు చేయడం ఒకటైతే సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) చిత్తుచిత్తుగా కొట్టడం మరో కారణం. మోస్తరు టార్గెటే కావడంతో హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) మొదట్లో ప్రెజర్‌ తీసుకోకుండా ఆడింది. అభిషేక్‌ కాస్త ఇబ్బంది పడ్డా ఒకట్రెండు షాట్లు బెటర్‌గా కనెక్ట్‌ అవ్వడంతో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. దాంతో కేన్‌ సేన 7.5 ఓవర్లకే వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తర్వాత జోరు మరింత పెరిగింది. 32 బంతుల్లోనే అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson)తో కలిసి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ముకేశ్‌ చౌదరి వేసిన 12.1 బంతికి భారీ షాట్ ఆడబోయి విలియమ్సన్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్‌ త్రిపాఠి (Rahul Tripathi) సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోవడంతో హైదరాబాద్‌ 17.4 ఓవర్లకే 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.