IPL 2022, CSK vs SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్‌కింగ్స్‌ మోస్తరు స్కోరే చేసింది. ప్రత్యర్థికి 155 పరుగుల టార్గెట్‌ ఇచ్చింది. కేన్‌సేన బౌలర్లు కసిగా బౌలింగ్‌ చేసి వికెట్లు పడగొట్టారు. పరుగులను నియంత్రించారు. యార్కర్ల నటరాజన్‌, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దాంతో ఎక్కువ భాగస్వామ్యాలు నమోదవ్వలేదు. సీఎస్‌కేలో మొయిన్‌ అలీ (48; 35 బంతుల్లో 3x4, 2x6), అంబటి రాయుడు (27; 27 బంతుల్లో 4x4) టాప్‌ స్కోరర్లు.






డే మ్యాచ్‌ కావడంతో టాస్‌ గెలిచిన వెంటనే కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు గెలవకపోవడంతో ఆట సాగుతున్నంత సేపు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లలో ఒకరకమైన పట్టుదల, కసి కనిపించాయి. ఓపెనర్లు రాబిన్‌ ఉతప్ప (15), రుతురాజ్‌ గైక్వాడ్‌ (16)ను ఎక్కువ స్కోరు చేయక ముందే ఔట్‌ చేశారు. జట్టు స్కోరు 25 వద్ద ఉతప్పను సుందర్‌, 36 వద్ద రుతురాజ్‌ను నటరాజ్‌ ఔట్‌ చేశారు. 


ఈ సిచ్యువేషన్‌లో అంబటి రాయుడు (Ambati Rayudu)తో కలిసి మొయిన్‌ అలీ (Moeen Ali) నిలకడగా పరుగులు చేశారు. వీరిద్దరూ అప్పుడప్పుడూ బౌండరీలు కొడుతూ, స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 50 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం వచ్చింది. జట్టు స్కోరు 98 వద్ద రాయుడిని సుందర్‌ (Washinton Sundar) బలిగొన్నాడు. మరికాసేపటికే హాఫ్‌ సెంచరీ ముందు మొయిన్‌ను మార్‌క్రమ్‌ పెవిలియన్‌ పంపించాడు. ఆఖర్లో ఎంఎస్‌ ధోనీ (3)విఫలమైనా జడ్డూ (23; 15 బంతుల్లో 2x4, 1x6) కాస్త ఆడటంతో సీఎస్‌కే 140/8కు పరిమితమైంది.