IPL 2022, PBKS vs GT Rahul Tewatia Memes: ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ అజేయమైన జట్టుగా మారింది. వరుసగా మూడు మ్యాచులాడి మూడూ గెలిచింది. ఇప్పటి వరకు ఓటమే తెలియకుండా ఆడుతోంది. అద్భుతమైన బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్‌ డెప్త్‌ ఆ జట్టు సొంతం. రాహుల్‌ తెవాతియా వంటి మ్యాచ్‌ ఫినిషర్లు ఉండటంతో భారీ లక్ష్యాలను సునాయాసంగా ఛేదిస్తున్నారు. మొదట బ్యాటింగ్‌ చేస్తే పెద్ద టార్గెట్లు సెట్‌ చేస్తున్నారు. ఇక పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచులో రాహుల్‌ తెవాతియా ఆటకు అంతా ఫిదా అవుతున్నారు. ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి గెలిపించడం అసాధారణ ఫీట్‌గా మారింది. మీమ్స్‌ వెల్లువలా వచ్చి పడుతున్నాయి.


గిల్‌ మొదలు పెడితే తెవాతియా థ్రిల్‌ చేశాడు


190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ మాథ్యూ వేడ్ వైఫల్యాల పరంపర ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగింది. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (96: 59 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), కొత్త ఆటగాడు సాయి సుదర్శన్ (35: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి పంజాబ్ 53 పరుగులు చేసింది.


ఆ తర్వాత కూడా వీరిద్దరూ ఏమాత్రం తడబడకుండా ఆడారు. వీరు దూకుడుగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 94-1కు చేరుకుంది. ఈ లోపే శుభ్‌మన్ గిల్ అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో వికెట్‌కు 101 పరుగులు జోడించిన అనంతరం రాహుల్ చాహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి సుదర్శన్ అవుటయ్యాడు.





అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (27: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు), గిల్ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయితే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టం అయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో 19వ ఓవర్లో సెంచరీ ముంగిట శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. చివరి ఓవర్లో లేని పరుగుకు ప్రయత్నించి హార్దిక్ పాండ్యా కూడా వికెట్ కోల్పోయాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన దశలో రాహుల్ టెవాటియా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు.