Cyberabad Police Arrested Fake Gold Coins Gang: తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నమ్మిస్తూ నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తోన్న ముగ్గురు సభ్యుల ముఠాను బాల్‌నగర్ పోలీసులు (Balanagar Police) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ కారు, 100 నకిలీ బంగారు నాణేలు (ఒక్కో నాణెం 20 గ్రాములు), రూ.28.5 లక్షల నగదు, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేశ్వరరావు, వేముల పుల్లారావు, బత్కపల సాంబశివరావు అనే నిందితులు తాండూరుకు చెందిన ఓ మహిళకు తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి నమ్మించారు.


మహిళ ఫిర్యాదుతో..


తమకు కస్టమ్స్ నుంచి బంగారం దిగుమతి అవుతుందని చెప్పి మహిళను ఫోన్‌లో సంప్రదించారు. అయితే, ఆమెకు నిందితులు బంగారం అమ్మే క్రమంలో ఆమెతో వచ్చిన గోల్డ్ స్మిత్ అది నకిలీ బంగారం అని తేల్చాడు. దీంతో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై పలు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు తెలిపారు. విజయవాడలో (Vijayawada) నకిలీ బంగారు నాణేలు తయారు చేసి వాటిని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠా చేతిలో ఇంకా మోసపోయిన వారి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.


మరోచోట డ్రగ్స్ పట్టివేత


మరోవైపు, డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తోన్న ముఠాను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో ఎస్ఓటీ శంషాబాద్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి నలుగురు నిందితుల ముఠాను పట్టుకున్నారు. నగరంలోని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా ఈ విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 1,250 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితులు రాజస్థాన్‌కు చెందిన వారేనని.. డ్రగ్స్ చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి తీసుకొస్తున్నట్లు చెప్పారు.


Also Read: Fake Diesel: నకిలీ డిజిల్ తయారీ గ్యాంగ్ అరెస్ట్- 12వేల లీటర్ల రెండు డీజిల్ లారీలు, కంపెనీ సీజ్