Fake Diesel gang arrested at Nandigama in Rangareddy District | షాద్‌‌నగర్: తినే తిండి, తాగే పాలు, చాయ్, అల్లం పేస్ట్, వాడే వస్తువులు, నూనెలు ఇలా కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు చెలరేగిపోతునున్నారు. తమకు తోచిన విధంగా నకిలీ వస్తువులు, కల్తీ ఉత్పత్తులు తయారు చేసి బురిడీ కొట్టిస్తున్నారు. దొరకనంత వరకు దర్జాగా తిరుగుతుంటారు. తాజాగా వేల లీటర్ల నకిలీ డీజిల్ తయారీ ముఠా ఆట కట్టించారు పోలీసులు. వారి వద్ద నుంచి 12 వేల లీటర్ల డీజిల్ ఉన్న రెండు లారీలను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఆ డీజిల్ తయారీ కంపెనీ, విక్రయిస్తున్న పెట్రోల్ బంక్‌లను సైతం అధికారులు సీజ్ చేశారు.


విజిలెన్స్, పోలీసుల ఆకస్మిక తనిఖీలు 
పక్కా సమాచారంతో విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న 12,000 లీటర్ల రెండు డీజిల్ ట్యాంకర్లను చాకచక్యంగా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. అక్రమ డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందని నిందితులను ఆరా తీసిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు అక్రమ ఆయిల్ మాఫియా దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గుజరాత్ నుంచి వేస్టేజ్ ఆయిల్ (Wastage Oils) తెలంగాణకు తీసుకువస్తున్నారు. నందిగామ వద్ద పెట్రోల్ బంక్ సహాయంతో అఫెక్స్ బయో ఫియల్స్ తయారీ పరిశ్రమలో నకిలీ బయో డీజిల్ తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 


పలు శాఖల అధికారులు, పోలీసులు సమన్వయంతో శనివారం (జులై 20న) విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నందిగామ బైపాస్ వద్ద ఒక మూసి ఉన్న కంపెనీలో అక్రమంగా గుజరాత్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి నిల్వచేసినట్లు గుర్తించారు. ఇక్కడ పనికిరాని అయిల్స్, డిజిల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేసి పర్మిషన్ లేకుండా, అక్రమంగా వివిధ బంకులకు, దగ్గరలోని పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. 


అక్రమంగా డీజిల్ తయారీ, విక్రయాలు 
అక్రమంగా డీజిల్ తయారు చేస్తున్న కంపెనీ సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. మొదట అక్కడ తనిఖీలు చేసి శాంపిల్స్ తీసుకొని మరిన్ని టెస్టుల కోసం ల్యాబ్ కి పంపించారు. అక్రమంగా డీజిల్ తయారు చేస్తున్న కంపెనీనీ సీజ్ చేసి 12 వేల లీటర్లతో ఉన్న రెండు డీజిల్ టాంకర్లను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత కాలం నుంచి ఆ కంపెనీలో అక్రమ డీజిల్ తయారుచేస్తున్నారు, ఇందులో ఎవరు ఇన్వాల్ అయ్యారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. ఇక్కడ పెట్రోల్ బంకుతో సహా అఫెక్స్ బయో ఫియోల్స్ తయారి పరిశ్రమను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్పీతో పాటు డిస్టిక్ సివిల్ సప్లై అధికారి మనోహర్ కుమార్ రాథోడ్, డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ వెంకటప్రసాద్ తదితరులు ఈ తనిఖీలు చేపట్టారు.


Also Read: 'అందంగా ఉన్నావ్ - చెప్పిన ప్లేస్‌కు రావాలి' - మహిళతో సీఐ అసభ్య చాటింగ్, ఉన్నతాధికారుల చర్యలు