సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటివరకూ బహుమతులు, లాటరీ, ఉద్యోగాల పేరిట జరిగిన మోసాలనే మనం చూశాం. తాజాగా, ఎన్నికల సందర్భాన్ని కూడా నగదు కాజేసేందుకు వాడుకుంటున్నారు. ఎన్నికల వేళ ఎవరి హడావుడిలో వారుంటే, జాతీయ నాయకుల పేర్లు, ఇతర పార్టీల పేర్లు వాడుకొని ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. 


ఫోన్ రీఛార్జ్ పేరిట సందేశం


తాజాగా, సోషల్ మీడియాలో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. ఓ జాతీయ పార్టీ 3 నెలలు ఉచితంగా ఫోన్ రీఛార్జ్ చేస్తుందంటూ వాట్సాప్, ఫేస్ బుక్ పోస్టులు, సందేశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సందేశం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 'ఉచిత రీఛార్జ్ కోసం కింది లింకును క్లిక్ చేసి గడవులోగా నమోదు చేసుకోవాలి.' అంటూ ఆ మెసేజ్ లో సూచిస్తున్నారు. దీనికి ఓ రాజకీయ పార్టీ అధికారిక వెబ్ సైట్ దగ్గరగా ఉండే వెబ్ అడ్రస్ లింక్ ఇచ్చారు. 


ఎన్నికల సందడితో వైరల్


తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల సందడితో ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతోంది. సరిగ్గా ఆర్నెళ్ల క్రితం ఇదే మెసేజ్ వైరల్ కాగా 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ గా తేల్చింది. ఇప్పటివరకూ ఈ లింక్ పై క్లిక్ చేసి నష్టపోయినట్లు ఎలాంటి ఘటనలూ వెలుగులోకి రాలేదు. అయితే, ఇలాంటి ఫేక్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల్లో కొందరైనా మోసపోవడానికి ఆస్కారముందని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. 


బీ అలర్ట్


సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పండుగలు, ఎన్నికల సమయాల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వివిధ రకాల రాయితీలు ఇస్తున్నట్లు ప్రముఖ ఈ - కామర్స్ సంస్థల పేర్లకు దగ్గరగా ఉండే లింక్స్ తో నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తారని, వాటిపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుందని, తద్వారా ఖాతా ఖాళీ అవుతుందని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు కానీ, నేతలు కానీ ఇలాంటి బహిరంగా ఆఫర్లు ఇవ్వరనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచిస్తున్నారు.


ఈ - చలానా పేరిట సైతం మోసం


సైబర్ నేరగాళ్లు గతంలో ఈ - చలానాల పేరిట సైతం మోసాలకు పాల్పడ్డారు. ట్రాఫిక్ పోలీసులమంటూ ఫేక్ చలానాలు మెసేజ్ ల రూపంలో పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. చలానాలపై 50 శాతం తగ్గింపు అంటూ ఆకర్షిస్తుండగా, నిజమేనని నమ్మిన చాలా మంది రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు వాటి పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు.


నగరాల్లో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమాని నెంబర్లకు చలానా వివరాలు సందేశాలుగా వస్తాయి. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. e-Challan పేరుతో ఫేక్ మెసేజెస్ పెట్టి సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. డబ్బు కట్టేందుకు లింక్ క్లిక్ చేయాలని చెబుతారు. సదరు లింక్ పై ఎవరైనా క్లిక్ చేస్తే మొబైల్ వ్యక్తిగత సమాచారం సహా మొత్తం డేటా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇలా మోసానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద నకిలీ మెసేజ్ లు వస్తే, వాటిని ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 8712672222 కు పంపి కంప్లైంట్ చేయాలని స్పష్టం చేశారు.


Also Read: ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ - ఈసీ కీలక ప్రకటన