తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీ కీలక అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం కుదించనున్నట్లు ప్రకటించింది. వీటిని సమస్యాత్మకంగా గుర్తించామని, అందుకే ఈ నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించనున్నట్లు తెలిపింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.


ఆ నియోజకవర్గాలివే


సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని అందుకే వీటిల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగించనున్నట్లు చెప్పారు.


ఈసీ ఆరా


మరోవైపు, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. సోమవారం ఉదయం సీఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వికాస్ రాజ్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎన్నికల సంఘానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నగదు, బంగారం ఎంత సీజ్ చేశామనే అంశాలకు సంబంధించి నివేదించారు. ఈ క్రమంలో ఈసీ పలు సూచనలు చేసింది. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు స్పష్టం చేసింది. 


ఓటర్లకు భరోసా


ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. భద్రత నిమిత్తం కేంద్ర బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. స్థానిక పోలీసులతో వారు సమన్వయం చేసుకుంటూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అలాగే, అక్రమ నగదు, బంగారం తరలింపుపై ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తమతో ఉంచుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ అధికంగా నగదు తరలించాల్సి వస్తే తగిన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకు రావాలని కోరుతున్నారు. 


రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా, 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 వరకూ నామినేషన్లు, 15 వరకూ నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఉంది. ఈ క్రమంలో రిటర్నింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం సహా, 100 మీటర్ల లోపు ఐదుగురి కంటే ఎక్కువ గుమి కూడొద్దని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముందుగానే  రూట్ మార్చ్ నిర్వహించి తగు ఏర్పాట్లు చేశారు. 


Also Read: బీఆర్ఎస్ వ్యూహం - నిన్న నాగం, నేడు విష్ణువర్థన్ రెడ్డి, అసంతృప్తులే టార్గెట్ గా దూకుడు పెంచిన గులాబీ పార్టీ