తెలంగాణ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కొత్త వ్యూహంతో దూసుకెళ్తోంది. ఓ వైపు ముమ్మరంగా ప్రచారం చేస్తూనే, మరో వైపు ఇతర పార్టీల అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునే దానిపై దృష్టి పెట్టారు. తద్వారా ఆ నేతల బ్యాక్ గ్రౌండ్, వారి రాజకీయ అనుభవం, ఆయా నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు తమకు ఎన్నికల్లో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలంతా ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ, అసంతృప్తులపై దృష్టి సారిస్తూ వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. 


తాజాగా, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ దక్కకపోవడంతో హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డితో సోమవారం మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఆదివారం విష్ణువర్థన్ రెడ్డి సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. 


బీఆర్ఎస్ లోకి విష్ణువర్థన్ రెడ్డి?


ఈ క్రమంలో విష్ణువర్థన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. జంట నగరాల్లో పీజేఆర్ అంటే తెలియని వ్యక్తి ఉండరని, కార్మికులకు, ప్రజలకు ఆయన ఎనలేని సేవలు చేశారని హరీష్ రావు కొనియాడారు. అలాంటి నేత వారసుడికి నేడు కాంగ్రెస్ పార్టీ ఎనలేని అన్యాయం చేసిందని విమర్శించారు. పార్టీలో శ్రమించిన వారికి గుర్తింపు లేకపోవడం వల్లే సీనియర్ నేతలు అసంతృప్తికి గురవతున్నట్లు చెప్పారు. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారని, త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకొంటారని పేర్కొన్నారు. నాగం జనార్థన్ రెడ్డి, విష్ణులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. 


ఈ పరిస్థితి ఊహించలేదు


కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. కొద్ది రోజులైతే గాంధీ భవన్ నే అమ్మేసే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ లో కేడర్ బాగానే ఉన్నా, నేతలే అమ్ముడు పోతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


మొన్న పొన్నాల, నిన్న నాగం


కాగా, కాంగ్రెస్ నుంచి జనగాం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తనను అవమానించారని, బీసీ నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన్ను మంత్రి కేటీఆర్ కలిసి బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను పొన్నాల దంపతులు కలిసి చర్చించిన అనంతరం జనగామ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. 


పొన్నాల బాటలోనే నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి రాకపోవడంతో సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా వచ్చిన వారికే పార్టీ టికెట్ ఇస్తుందని, కష్టపడి పని చేసిన వారికి మొండిచేయి చూపించిందని నాగం మండిపడ్డారు. అనంతరం బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ నాగంతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. దీంతో నాగం జనార్థన్ రెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.


Also Read: తెలంగాణలో అభివృద్ధిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం