తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.  ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వంలో ‘కీడా కోలా’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ తో పాటు  బ్రహ్మానందం, చైతన్యరావు, జీవన్‌, రఘురామ్‌ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. నవంబరు 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


నన్ను హీరోగా పరిచయం చేసిందే తరుణ్ 


ఈ వేడుకలో తరుణ్ భాస్కర్ తో తన ఫ్రెండ్షిప్ గురించి విజయ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. “తాను హీరోగా ఈ రోజు నిలబడ్డానంటే అందుకు కారణం తరుణ్ భాస్కర్. నన్ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. మన జీవితాన్ని మూడు విషయాలు ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. అవి పెరిగిన వాతావరణం, తీసుకునే నిర్ణయాలు, కలిసే వ్యక్తులు.  ఈ మూడు అంశాల కారణంగానే ఈ రోజు ఈ స్టేజి మీద ఉన్నాను. మీ ముందు మాట్లాడుతున్నాను. నేను ఇలా ఉండటానికి కారణం దర్శకులు నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్‌. నిజానికి మొదట్లో వీళ్లు ఎవరో తెలియదు. నేనెవరో వాళ్లకూ తెలియదు. కానీ, సినిమా మమ్మల్ని దగ్గర చేసింది. మేం ఎవరో తెలియకపోయినా ప్రేక్షకులు ‘పెళ్లి చూపులు’ సినిమాను చక్కగా ఆదరించారు. ఈ సినిమాతో తరుణ్ కు జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత తనకు ఎలాంటి సినిమా అయినా తీసే అవకాశం ఉంది. కానీ, ఆయనకు నచ్చిన సినిమాలను మాత్రమే తీస్తాడు. సినిమాలను బిజినెస్ గా ఆయన ఎప్పుడూ చూడలేదు” అని విజయ్ చెప్పారు. 


పాకెట్ లో రూపాయి లేకపోయినా..


ఒకానొక సమయంలో పాకెట్ లో రూపాయి లేకపోయినా, ఈ ప్రపంచం మాదే అనే కాన్ఫిడెంట్ తో తరుణ్, తాను తిరిగేవాళ్లనమని చెప్పారు దేవరకొండ.  సినిమాలు చేసే ముందు వరకు తమ పరిస్థితి ఇదే అన్నారు. ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆ రోజు తమకు ఉన్న మైండ్ సెట్ అన్నారు. ఇక తన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో ఓ మధ్య తరగతి అబ్బాయిగా కనిపించబోతున్నట్లు చెప్పారు. “ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక పిల్లాడు వస్తాడు. అతడు ఆ ఫ్యామిలీ డైరెక్షనే మారుస్తాడు. ఆ ఫ్యామిలీ కష్టాలు, కన్నీళ్లను మర్చేస్తాడు.  తాను నటించే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో కూడా ఇదే చూపించబోతున్నాం. ఓ మధ్యతరగతి యువకుడు ఆ కుటుంబానికి సంబంధించిన రాతను ఎలా మార్చాడు అనేది ఈ సినిమా కథ” అని చెప్పారు.  'గీత గోవిందం' మూవీ డైరెక్టర్ పరశురాం 'ఫ్యామిలీ స్టార్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.


Read Also: ‘రానా నాయుడు’ చూసి బాధపడ్డా, బాబీ డియోల్ సంచలన వ్యాఖ్యలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial