Telangana Assembly Elections 2023: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మహామహులకు కేరాఫ్ అడ్రస్.  ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి కళ్లు ఈ జిల్లాపైనే ఉంటాయి. మూడు పార్టీల నుంచి పలువురు కీలక నేతలు ఎన్నికల బరిలోకి దిగారు. బీఆర్ఎస్ తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్,  మున్సిపల్ ఐటీ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరంతా రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరున్న నేతలే. సుదీర్ఘకాలం ప్రజాసేవకు అంకితం అయిన వారే. అటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న వారు, ఇటు ప్రతిపక్ష పార్టీలో మంచి గుర్తింపు ఉన్న రాష్ట్ర స్థాయి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 


బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ తరపున ఐదోసారి సిరిసిట్ల నుంచి పోటీ చేస్తున్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నుంచి మంత్రి కేటీఆర్...2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు. బీజేపీ తరపున రాణిరుద్రమ పోటీ చేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్షా 18వేల మంది మహిళా ఓటర్లు ఉంటే...లక్షా 14వేల మంది పురుష ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రాణిరుద్రమకు టికెట్‌ కేటాయించింది కమలం పార్టీ. కొప్పుల ఈశ్వర్ కూడా ఐదోసారి ధర్మపురి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ కేబినెట్ లో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.  


బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి ఆయన హ్యాట్రిక్ కొట్టారు. 2009లో టీడీపీ తరపున, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరపున విజయం సాధించారు. నాలుగోసారి బరిలోకి దిగిన ఆయన ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ఢీ కొట్టబోతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్‌పై గంగుల విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయిన బండి సంజయ్, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభ నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలన్న లక్ష్యంతో బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ 18 చోట్ల గెలుపొందింది. అందుకే బండి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. 


బీజేపీ తరపున హుజురాబాద్‌ అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. హుజురాబాద్ నియోజకర్గం నుంచి ఆరోసారి బరిలోకి దిగారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ 2004, 2008 ఎన్నికల్లో కమలాపూర్ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. 2009, 2010, 2014, 2018 హుజురాబాద్‌ స్థానం నుంచి విజయం సాధించారు. 2021లో  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి...బీజేపీ తరపున గెలుపొందారు. ఈటల రాజేందర్ ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. అదే ధీమాతో 8వ సారి హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొట్టబోతున్నారు.  


2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచి గెలుపొందిన ధర్మపురి అరవింద్, తొలిసారి కోరుట్ల అసెంబ్లీ నుంచి బరిలోకి దిగారు.  అటు మంథని నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోసారి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2018 వరుస ఎన్నికల్లో గెలుపొందారు. ఒక్క 2014లో మాత్రమే శ్రీధర్‌ బాబు ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై శ్రీధర్ బాబు గెలుపొందారు. వీరితో పాటు పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు. మానకొండూరు నుంచి రసమయి బాలకిషన్, మాజీ మంత్రి జువ్వాది రత్నాకర్ రావు తనయుడు జువ్వాది నర్సింగరావు వంటి నేతలు ఎన్నికల బరిలో నిలిచారు.