నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి బీఅర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.  ఆదివారం హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్మల్ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.


ఈ సంధర్బంగా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... అవినీతి పాలనను అంతమొందించడానికి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి నిర్మల్ లో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ చేరికలు నిర్మల్ లో బీజేపీ గెలుపుకు  తోడ్పడుతుందని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విసుగు చెంది ఈ సారి మార్పుకు సిద్ధమయ్యారని, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును ప్రజలు నిర్ణయించారని అన్నారు.


బీఆర్‌ఎస్ పాలనలో బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ హయాంలోనూ వారికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పేదలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా న్యాయం జరగాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు. గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు బీజేపీ నేతలు వెళ్తే .. ముఖ్యమంత్రికి అంత ఉలుకెందుకని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలకు అన్ని పథకాలు అందినట్లయితే సిఎం ఎందుకు భయపడుతున్నట్లని నిలదీశారు. గజ్వేల్ ఏమైనా కెసిఆర్ ప్రైవేట్ ఆస్తా? అక్కడికి వెళ్తే అడ్డుకునే హక్కు ఆయనకు లేదన్నారు.


పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ నాయకులను కాదని అనుకూలమైన వ్యక్తులకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు అమాయకులు అనుకోవద్దని, రైతుల శక్తి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తారన్నారు. కాంగ్రెస్ హయాంలో కమిషన్లు తీసుకుంటే.. బిఆర్‌ఎస్ హయాంలో వాటాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా తెలంగాణను దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. 


సీఎం కేసీఆర్ పై రాష్ట్రంలో ఇక యుద్ధం మొదలైందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బిజెపి పార్టీలో చేరికలను ఎవరు ఆపలేరని చెప్పారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక కార్యకర్త కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త బిజెపి గెలుపు కోసం పాటుపడాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ లో కొనసాగిన ఈ నేతలంతా ఎమ్మెల్యే పనితీరుకు నిరసనగా ఆయన కు వ్యతిరేకంగా బీజేపీలో చేరారన్నారు. ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించేందుకు అంతా సిద్ధమయ్యారని వెల్లడించారు.


వీరితో పాటు బిఅర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎంపీపీ లు ఫనిందర్ రావ్, సుదర్శన్ గౌడ్, రవీందర్ గౌడ్, చక్రపాణి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్, మాజీ సర్పంచ్ లు శనిగారపు చిన్నయ్య, రాజేందర్ రెడ్డి, గంగయ్య, టీచర్స్ యూనియన్ సభ్యులు రాజేశ్వర్ రావ్, ప్రముఖ వ్యాపార వేత్త విద్యాసాగర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు.


ఈ కార్యక్రమంలో నాయకులు ప్రేమెందర్ రెడ్డి, అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మల్లారెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, ఆంజుకుమార్ రెడ్డి, సాదం అరవింద్, ప్రజొత్ రావ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.