తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్‌కు చెందిన కూలీలు అన్నపరెడ్డిపల్లె మండలానికి పనికి బొలేరో వాహనంలో బయలుదేరారు. బొలేరో వాహనం తిప్పనపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్‌ ఈ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు కత్తి స్వాతి, సుజాత ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మొత్తం పది మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్రం లక్ష్మి, సాయమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ నాగరాజు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు అంటున్నారు. 



Also Read: పోలీసుల చేతిలో వరుస చైన్ స్నాచింగ్‌ల దొంగ, గొలుసు లాక్కెళ్లేటప్పుడు ఎంతో తెలివి.. పోలీసులు వెల్లడి


అనంతపురంలో కూలీల ఆటో బోల్తా


అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎన్.హనుమాపురం శివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. కనేకల్ మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 15 మంది ఆటోలో ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలోని పంటపొలాల్లో పనిచేసేందుకు వెళ్తున్నారు. గురువారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా ఎన్‌.హనుమాపురం గ్రామం సమీపంలోని ఆర్ అండ్​బి రహదారిలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అంబులెన్స్​లో క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అయితే  ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు అనంతపురంలో ఆసుపత్రికి తరలించారు. ఆటోను అతివేగంతో అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు అంటున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కనేకల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.