కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడు ఉమేశ్ ఖతిక్ అనే వ్యక్తి సొంతూరు గుజరాత్‌లోని అహ్మదాబాద్ అని చెప్పారు. ఇతను వివిధ రాష్ట్రాల్లో 100కు పైగా గొలుసు దొంగతనాలు చేశాడని వివరించారు. మైనర్‌గా ఉన్న సమయంలోనే ఈ దారిని ఎంచుకున్న ఇతను జైలుకెళ్లినా బుద్ధిని మార్చుకోలేదు. ఈ నెల 19న హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో కూడా వరుసగా 6 గొలుసు దొంగతనాలు చేసి పారిపోయాడు. హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో ఇచ్చిన సమాచారం ప్రకారం తాజాగా అహ్మదాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై గతంలోనే ఓ కేసు ఉండడంతో ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచారు.


విచారణలో భాగంగా నిందితుడు ఉమేష్ ఖతిక్ నుంచి ఆసక్తికర వివరాలు బయటికి వచ్చాయి. నిందితుడు భార్యపై ప్రేమతోనే వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లుగా తేలింది. చోరీలు చేసే సమయంలో ఎటువంటి ట్రాకింగ్ ఉండకుండా ఉండేందుకు సెల్‌ ఫోన్లలోని సిమ్‌ కార్డులు తీసేస్తుంటానని ఒప్పుకున్నాడు. రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ఉమేష్‌ ఖతిక్‌పై కేసులున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా ఇతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే, హైదరాబాద్ పోలీసులు మాత్రం ట్రాన్సిట్‌ వారెంట్‌ ప్రకారం అతడిని హైదరాబాద్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం కరోనా తీవ్రత నేపథ్యంలో అతణ్ని నగరానికి తీసుకొచ్చి మరింత విచారణ చేయాలా వద్దా అనే విషయంపై పోలీసులు వెనకడుగు వేస్తున్నారు. గతంలో ఉమేష్‌ ఇక్కడ ఏమైనా నేరాలు చేశాడా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.


ఇదిలా ఉండగా, జనవరి 24న ఉమేష్ ఖతిక్‌ను పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని పోలీసులు తర్వాత స్పష్టత ఇచ్చారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఉమేష్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. 


గంటలోనే 6 కేసులు
ఒక గంట వ్యవధిలోనే హైదరాబాద్‌లోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 6 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. దీంతో ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో నిందితుడిని గుర్తించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీని విశ్లేషించడం ద్వారా చైన్ స్నాచర్‌ను పోలీసులు గుర్తించారు. అంతేకాక, నిందితుడు రాష్ట్రం వదిలి పారిపోయినట్లుగా కూడా తెలుసుకున్నారు. అతనిది అహ్మదాబాద్ అని గుర్తించి.. అక్కడి పోలీసులకు వివరాలు అందించి నిందితుడి ఆచూకీ కనుగొన్నారు.