అమెరికా సాంకేతిక దిగ్గజం గూగుల్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో ఒక బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. 'భారతీయ డిజిటలీకరణ నిధి కోసం గూగుల్‌'లో భాగంగా ఈ ముందడుగు వేసింది. దేశవాసులకు అందుబాటు ధరలోనే స్మార్ట్‌ఫోన్లు అందించడం, భారత్‌కే ప్రత్యేకమైన 5జీ యూజ్‌ కేసెస్‌ను సృష్టించడంపై ఈ రెండు సంస్థలు దృష్టి సారిస్తాయి.


భారతీ ఎయిర్‌ టెల్‌లో ఒక షేరుకు రూ.734 చెల్లించి 1.28 శాతం వాటాను గూగుల్‌ కొనుగోలు చేయనుందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ సెబీకి వివరాలు సమర్పించిందని తెలిసింది. మరో 300 మిలియన్‌ డాలర్లను బహుళ వార్షిక ఒప్పందాల కోసం కేటాయిస్తున్నారు. భారత్‌లో క్లౌడ్‌ వాతావరణాన్ని ఒక దిశకు తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థలు కృషి చేస్తాయని సమాచారం.


Also Read: MSME Sector Budget 2022 Expectations: నిర్మలమ్మా..! 'సూక్ష్మం' ఎరిగి 'లాభం' చేకూర్చండి!!


Also Read: Tata Taken Air India: ఇక టాటా వారీ 'ఎయిర్‌ ఇండియా'! ప్రభుత్వం నుంచి వాటాలు అధికారికంగా బదిలీ


టెక్నాలజీ సంస్థలకు భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అన్న సంగతి తెలిసిందే. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌, ప్రకటనలకు ఇక్కడ భారీ మార్కెట్‌ ఉంది. అలాగే ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి ఇక్కడ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. గూగుల్‌ గతంలో ముకేశ్‌ అంబానీకి చెందిన డిజిటల్‌ యూనిట్‌లో పెట్టుబడులు పెట్టడం గమనార్హం.


'వినూత్నమైన ఉత్పత్తులతో భారత డిజిటల్‌ రంగాన్ని వృద్ధి చేయాలన్న దార్శనికతను ఎయిర్‌టెల్‌, గూగుల్‌ పంచుకున్నాయి. ఇప్పటికే మాకు భవిష్యత్తుకు అవసరపడే నెట్‌వర్క్‌, డిజిటల్‌ వేదికలు, పల్లెపల్లెకు విస్తరించిన డిస్ట్రిబ్యూషన్‌, చెల్లింపుల వేదికలు ఉన్నాయి. ఇప్పుడు గూగుల్‌తో కలిసి దేశంలోని డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మేం గూగుల్‌తో కలిసి పనిచేస్తాం' అని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునిల్‌ భారతీ మిట్టల్‌ అన్నారు.


'భారత డిజిటలీకరణ నిధి కోసం గూగుల్‌లో భాగంగా మేం ఎయిర్‌లెట్‌లో వాణిజ్యపరమైన ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నాం. స్మార్ట్‌ ఫోన్ల వినియోగం పెంచడం, సరికొత్త బిజినెస్‌ మోడళ్లకు మద్దతుగా అనుసంధానత పెంచడం, ఇప్పటికే ఉన్న కంపెనీల డిజిటల్‌ పరివర్తనకు సాయం చేయడమే మా లక్ష్యం' అని గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నారు.