ఎయిర్‌ ఇండియా విక్రయం అధికారికంగా ముగిసింది. కంపెనీ నియంత్రణ బాధ్యతలు, ఇతర ఆస్తులను టాటా గ్రూప్‌కు అధికారికంగా బదిలీ చేశారు. ఇక నుంచి ఎయిర్‌ ఇండియాను పూర్తిగా టాటా గ్రూపే నియంత్రించనుంది. నాన్‌కోర్‌ ఆస్తులను బదలాయించేందుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌ ఇండియా, టాటా బోర్డు మధ్య ఒప్పందం కుదిరిందని ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది.


'ఎయిర్‌ ఇండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ లావాదేవీ ఈ రోజు విజయవంతంగా ముగిసింది. వ్యాపార నియంత్రణతో పాటు ఎయిర్‌ ఇండియాలో వందశాతం వాటాను టాలాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు బదిలీ చేశాం. కొత్త బోర్డు, కొత్త వ్యూహాత్మక భాగస్వామి ఇక నుంచి ఎయిర్‌ ఇండియా బాధ్యతలను తీసుకుంటారు' అని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే తెలిపారు.


'ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసినందుకు ఆనందిస్తున్నాం. టాటా గ్రూప్‌లోకి ఎయిర్‌ ఇండియా తిరిగి చేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌ను తిరిగి సృష్టించేందుకు మేం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తాం' అని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ అన్నారు. ఎయిర్‌ ఇండియాను పూర్తిగా అప్పగించే ముందు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.






ఎయిర్‌ ఇండియా చరిత్ర ఇదీ


దాదాపు ఏడు దశాబ్దాల తరువాత ఎయిర్ ఇండియాను తిరిగి టాటా కంపెనీ సొంతం చేసుకుంది. ఎయిర్‌ ఇండియాను అమ్మకానికి పెట్టినప్పుడు స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్‌తో పాటు మరికొందరు బిడ్లు దాఖలు చేశారు. రూ.18 వేల కోట్లతో టాటా సన్స్ దానిని సొంతం చేసుకుంది.


నిజానికి ఎయిర్ ఇండియాను 1932లో టాటా సంస్థ స్థాపించింది. ఆపై 1953లో ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో విస్తారా విమాన సేవలను టాటా సంస్థ అందిస్తోంది. ఎయిర్ ఇండియా నష్టాలతో కూరుకుపోతుండడంతో మెజారిటీ వాటాలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2018లో బిడ్‌ల‌కు కేంద్రం ఆహ్వానించినా.. వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. సుమారు 76 శాతం వాటాను విక్రయించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా వేసిన బిడ్‌లలో స్పైస్ జెట్‌తో పోటీ ఎదుర్కొని టాటా సన్స్ ఎయిరిండియాను తిరిగి దక్కించుకుంది.


Also Read: Stock Market Update: హమ్మయ్యా..! -1400 నుంచి -581కు పుంజుకున్న సెన్సెక్స్‌.. నిఫ్టీదీ అదే దారి!


Also Read: LIC Profits: ఎల్‌ఐసీ బంపర్‌ ప్రాఫిట్‌..! ఐపీవో ముందు అదరగొట్టిన బీమా సంస్థ