ఉదయం రక్తమోడిన స్టాక్‌ మార్కెట్లు కాస్త కోలుకున్నాయి! భారీగా పతనమైన కీలక సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. సమీప భవిష్యత్తులో అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు పెరుగుతాయన్న వార్తలు రావడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గురువారం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. దాంతో మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 1400 పాయింట్ల వరకు పతనమై తిరిగి పుంజుకుంది. నిప్టీ 17,200 దిగువన ముగిసింది.


క్రితం సెషన్లో 57,858 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,317 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. అక్కడ్నుంచి దిగువ ముఖంగానే సూచీ పయనించింది. 56,439 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యా్హ్నం సమయంలో దాదాపుగా 1400 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత పుంజుకోవడంతో చివరికి 581 పాయింట్ల నష్టంతో 57,276 వద్ద ముగిసింది.


మంగళవారం 17,277 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,062 వద్ద గ్యాప్‌డౌన్‌ ఆరంభమైంది. ఆ తర్వాత అథో ముఖంగా పయనిస్తూ 16,866 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో దాదాపుగా 410 పాయింట్ల మేర పతనమైంది. ఆ తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో చివరికి 167 పాయింట్ల నష్టంతో 17,110 వద్ద ముగిసింది.


Also Read: LIC Profits: ఎల్‌ఐసీ బంపర్‌ ప్రాఫిట్‌..! ఐపీవో ముందు అదరగొట్టిన బీమా సంస్థ


బ్యాంక్‌ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య కొనసాగింది. ఉదయం 37,058 వద్ద మొదలైన సూచీ 37,012 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 500 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత టర్న్‌ అరౌండ్‌ కావడంతో 275 పాయింట్ల లాభంతో 37,058 వద్ద ముగిసింది.


నిఫ్టీలో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ముగిశాయి. సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, మారుతీ లాభాల్లో ముగిశాయి.  హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్, టీసీఎస్‌, విప్రో నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఏకంగా ఐదు శాతం లాభపడింది. ఆటో, బ్యాంకు సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఫార్మా, ఐటీ సూచీలు 1-3 శాతం వరకు పతనం అయ్యాయి.