తమిళనాడులో నట సింహ నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి చెప్పడానికి ఇదొక ఉదాహరణ అనుకోవాలి. ఆయన నటించిన లేటెస్ట్ హిట్ సినిమా 'అఖండ'. తెలుగు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించింది. ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లకు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు ఏసుకుని వచ్చి మరీ సినిమా చూశారు. మంచి వసూళ్లు వచ్చాయి. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీ వేదికలో కూడా అందుబాటులోకి వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'అఖండ' స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. అయినా... తెలుగునాట కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శింపబడుతోంది. షోస్ వేస్తున్నారు. ఇప్పుడీ సినిమా తమిళనాడుకు వెళుతోంది.
'అఖండ' సినిమాను తమిళంలో డబ్ చేశారు. జనవరి 28 అనగా... ఈ శుక్రవారం తమిళనాట థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అవును.... మీరు చదివింది నిజమే! తెలుగులో సినిమా విడుదల అయిన 50 రోజుల తర్వాత, అదీ ఓటీటీలో సబ్ టైటిల్స్‌లో సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత మరో భాషలో డబ్ చేసి విడుదల చేస్తున్నారంటే విశేషమే కదా! హిందూ ధర్మం, శివతత్వం అంశాలతో తీసిన ఈ సినిమాకు తమిళనాట కూడా తెలుగులో లభించిన ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నారు.
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఇది. బాలకృష్ణను బోయపాటి శ్రీను చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అఘోరా క్యారెక్టర్, ఆ పాత్రలో బాలయ్య విశ్వరూపం జనాలను ఆకట్టుకుంది. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. 'జై బాలయ్య' సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. పాటల కంటే నేపథ్య సంగీతానికి ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో పెద్దగా సినిమాలు ఏవీ లేవు. సో... ఈ సినిమాకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అమెరికాలోని థియేటర్లలో మోత మోగింది. తమిళనాట కూడా సేమ్ రెస్పాన్స్ రావచ్చు... దబిడి దిబిడే!