Assam Crime News:
అసోంలో దారుణం..
అసోంలో ఓ కుటుంబంలో జరిగిన హత్యలు ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. 25 ఏళ్ల నిందితుడు నజీబుర్ రహమాన్ తన భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులనూ దారుణంగా హత్య చేశాడు. ఆ తరవాత 9 నెలల పాపతో సహా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. అసోంలోని గోలాఘాట్ ప్రాంతంలో జరిగిందీ దారుణం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నజీబుర్, సంఘమిత్రకి 2020 నుంచి పరిచయం ఉంది. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో వీళ్లిద్దరికీ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్ది నెలల్లోనే అది ప్రేమగా మారింది. 2020లోనే ఇద్దరూ కోల్‌కత్తాకి పారిపోయారు. అక్కడే ఓ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోయారు. తరవాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూతురిపైనే కంప్లెయింట్ ఇచ్చారు. దొంగతనం కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమె నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంది. ఆ తరవాత బెయిల్‌పై విడుదలైంది. గతేడాది జనవరిలో మరోసారి నజీబుర్, సంఘమిత్ర పారిపోయారు. చెన్నైకి మకాం మార్చారు. అక్కడే 5 నెలల పాటు ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చే సమయానికి సంఘమిత్ర గర్భం దాల్చింది.
ఇలా జరిగింది..
గతేడాది నవంబర్‌లో ఓ బాబు పుట్టాడు. ఈ ఏడాది మార్చి నెలలో బిడ్డతో పాటు సంఘమిత్ర తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. భర్త తనను తీవ్రంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం చేసినట్టు చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజీబుర్‌ని అరెస్ట్ చేశారు. నెల రోజుల తరవాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైల్ నుంచి వచ్చిన వెంటనే బిడ్డను చూడాలనుకున్నాడు నజీబుర్. కానీ...అందుకు సంఘమిత్ర కుటుంబం ఒప్పుకోలేదు. ఆ తరవాత నజీబుర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడిని సంఘమిత్ర కుటుంబం వేధిస్తోందని ఆరోపించాడు. ఇలా రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. సహనం కోల్పోయిన నజీబుర్ ఆగ్రహంతో తన భార్యతో సహా ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. తన బిడ్డతో పాటు పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు CID విచారణ చేపడుతోందని వెల్లడించారు.
Also Read: ఇన్‌స్టాలో పరిచయం- సినిమా ఛాన్స్ అంటూ నటిపై బలత్కారం- గురుగ్రామ్‌లో దారుణం