IND vs PAK: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అత్యంత క్రేజ్ ఉన్న ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ తేదీ మారనుందా..? ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ అక్టోబర్ 15న ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. అక్టోబర్ 15 నుంచే దేశంలో నవరాత్రి ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ - పాక్ మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజును గుజరాత్‌తో ‘గర్బా నైట్’ జరుపుకుంటారు. గర్బా నైట్స్‌లో భాగంగా రాత్రి మహిళలు, పురుషులు దాండియా ఆడతారు. ఇది గుజరాత్‌లో ఓ వేడుకలా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న భారత్ - పాక్ మ్యాచ్ నిర్వహించడం సరికాదన్న అభిప్రాయాన్ని గుజరాత్ సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి నివేదించినట్టు తెలుస్తున్నది. 15న కాకుండా అక్టోబర్ 14కు రీషెడ్యూల్డ్ చేయాలని సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐని కోరుతున్నట్టు సమాచారం.
ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘మేము మావద్ద ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నాం. దీనిపై త్వలోనే నిర్ణయం తీసుకుంటాం. అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న అహ్మదాబాద్‌కు మ్యాచ్ చూసేందుకు వేలాది మంది తరలివచ్చే అవకాశం ఉంది గనక రాత్రి పూట భద్రతా సమస్యలు తలెత్తవచ్చు అన్న అభిప్రాయాన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు వెల్లడించాయి..’అని తెలిపారు.
సాధ్యమేనా..?
అహ్మదాబాద్‌లో భారత్ - పాక్ మ్యాచ్ రీషెడ్యూల్ చేయడం అనేది అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఐసీసీ ఆధ్వర్యంలో జరుగబోయే ఈ టోర్నీలో.. షెడ్యూల్‌ను మార్చితే అది ఇతర మ్యాచ్‌ల మీద కూడా ప్రభావం పడుతుంది. అదీగాక వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నుంచే అహ్మదాబాద్‌లో హోటల్స్ మొత్తం బుక్ అయిపోయాయి. ఫైవ్ స్టార్, టూ స్టార్, త్రీ స్టార్ హోటల్స్‌తో పాటు సాధారణ హోటల్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నాయి. ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 8 వేల వరకూ ఉన్న ఒక హోటల్ రూమ్ అద్దె.. అక్టోబర్‌లో రూ. 80 వేల నుంచి లక్ష రూపాయలు వెచ్చించినా దొరకడం లేదు. ఎయిర్ ట్రావెల్ రేట్లు కూడా అక్టోబర్ నాటికి కొండెక్కుతున్నాయి. మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయాలంటే పైన పేర్కొన్న వాటిపైనా ప్రభావం పడుతుంది. ఇదివరకే గదులను, విమానం టికెట్లను బుక్ చేసుకున్నవారికి ఇది నష్టం చేకూర్చేదే. మరి ఈ విషయంలో బీసీసీఐ, ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial