Budget 2022 Telugu, Union Budget 2022: అన్నదాతలకు శుభవార్త! ఈ సారి ప్రవేశపెట్టేది ప్రజాకర్షక, రైతులకు మేలు చేసే బడ్జెట్టేనని సమాచారం. కర్షకుల ఆదాయం పెంచేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిసింది. మెరుగైన మద్దతు ధర, సులభంగా పంట రుణాలు, ఎక్కువ రాయితీ, ఎక్కువ నగదు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రైతు చట్టాలతో వ్యతిరేకత పెరగడం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం, కరోనా వైరస్‌తో ఇబ్బందులు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


నగదు బదిలీ పెంపు


ప్రస్తుతం పీఎం కిసాన్‌ యోజన కింద రైతులకు ప్రభుత్వం నగదు బదిలీ చేస్తోంది. ఏడాదికి రూ.6000 వరకు ఇస్తోంది. ఇప్పుడీ మొత్తాన్ని రూ.8000కు పెంచుతారని తెలుస్తోంది. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు ప్రకటన చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పది కోట్లకు పైగా రైతులు ఈ పథకంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇందుకోసం గత బడ్జెట్‌లో రూ.65,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు లక్ష కోట్లకు పెంచినా ఆశ్చర్యం లేదు.


మద్దతు ధరకు కమిటీ


మూడు రైతు చట్టాలు తెచ్చినప్పుడు కర్షకులు వాటిని రద్దు చేయాలని పోరాటం చేశారు. చట్టాల బదులు పంటలకు మెరుగైన మద్దతు ధర కల్పించాలని  డిమాండ్‌ చేశారు. వారి కోరిక నెరవేర్చేందుకు కనీస మద్దతు ధర కోసం ఒక కమిటీని నిర్మలా సీతారామన్‌ ప్రకటించనుంది.


పంట రుణాలు పెంపు


రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. ప్రస్తుతం రూ.16.5 లక్షల కోట్లుగా ఉన్న రైతు రుణ లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో రూ.18 లక్షల కోట్లకు పెంచబోతున్నారని తెలిసింది. ఏటా ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. రూ. 3 లక్షల రుణానికి 7 శాతం వడ్డీ అమలు చేస్తున్నారు. సరైన సమయంలో రుణాన్ని తీర్చేస్తే వివిధ రాయితీలు అందిస్తోంది. ఫలితంగా చెల్లించాల్సిన వడ్డీ  నాలుగు శాతానికి తగ్గుతుంది.


పంట ఉత్పత్తి పెరిగేలా


రైతు సహకార సంఘాలు, రైతు సంఘాలకు మద్దతునిచ్చి పంట ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖకే ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తుల నిల్వ, రవాణాకు మౌలిక సదుపాయాలు కల్పించనుంది. ఇందుకోసం రూ.10,900 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది.


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!


Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!


Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!