రోనా వైరస్ (Covid-19) నేపథ్యంలో చాలామంది హాస్పిటళ్లకు వెళ్లకుండా ఇళ్లలోనే సొంత చికిత్స చేసుకుంటున్నారు. అయితే, కరోనా రాక ముందు నుంచి కూడా ఈ అలవాటు ఉంది. చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా పారాసెటమాల్(Paracetamol) లేదా డోలో(Dolo) మాత్రలు మింగేస్తుంటారు. వాటితోపాటు కొందరు క్రోసిన్(Crocin), కాల్పోల్(Calpol) తదితర మాత్రాలను వాడేస్తారు. కానీ చాలా మందికి వాటిని ఖచ్చితంగా ఎంత పరిమాణం(మోతాదు)లో తీసుకోవాలో తెలియదు. 


జ్వరం వస్తే పారాసెటమాల్ ఎంత మోతాదులో తీసుకోవాలి?: అమెరికా వైద్య నిపుణులు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం.. పెద్దలకు జ్వరం వస్తే.. 325 mg నుంచి 650 mg పారాసెటమాల్‌ను 4 నుంచి 6 గంటల వ్యవధిలో ఇవ్వాలి. అలాగే, మాత్రకు మాత్రకు మధ్య గ్యాప్ కూడా మోతాదు బట్టి సుమారు 6 గంటల వ్యవధి ఉండాలి. జ్వరం ఎక్కువగా ఉన్నా, ఎక్కువ సేపు ఉన్నా వైద్యులు 1000 mg వరకు పారాసెటమాల్ ఇస్తారు. అయితే, ఆ మోతాదును స్వయంగా తీసుకోకూడదు. కేవలం వైద్యులు చెబితేనే తీసుకోవాలి. ఎందుకంటే వైద్యులు బాధితుడికి ఉన్న వ్యాధులు, బరువు, ఎత్తు, వాతావరణం ఆధారంగా మోతాదులను నిర్ణయిస్తారు. అలాగే జ్వరం వచ్చిన 6 గంటల తర్వాత మాత్రమే 500 mg పారాసెటమాల్ తీసుకోవాలి. చిన్నపిల్లలకు పారాసెటమాల్ ఇచ్చేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జ్వరం వచ్చినట్లయితే 4 నుంచి 6 గంటల వ్యవధిలో ఒక కిలో బరువుకు 10 నుంచి 15 mg పారాసెటమాల్ మాత్రమే ఇవ్వాలి. అదే మోతాదులో 6 నుంచి 8 గంటల వ్యవధిలో 12 సంవత్సరాల వరకు వయస్సు గల పిల్లలు ఇవ్వాలి. 


నొప్పులు ఉంటే ఎంత మోదాదులో తీసుకోవాలి?: పెద్దలకు ఒళ్లు నొప్పులు ఉంటే 325 mg నుంచి 650 mg పారాసెటమాల్ మాత్రను 4 నుంచి 6 గంటల వ్యవధిలో తీసుకోవాలి. నొప్పులు మొదలైన 6 నుంచి 8 గంటల వ్యవధిలో 1000 mg వరకు తీసుకోవచ్చు. అయితే, దీనికి కూడా వైద్యులు సలహా తప్పనిసరి. చిన్న పిల్లల్లో ఈ సమస్య ఉంటే.. 6 నుంచి 8 గంటల మధ్య ఒక కిలో(శిశువు బరువు)కు 10 నుంచి 15 mg తీసుకోవాలి. కాబట్టి.. మీ పిల్లల బరువుపై మీకు తప్పకుండా అవగాహన ఉండాలి. ఎంతకీ జ్వరం తగ్గడంలేదనే కారణంతో పారాసెటమాల్ వేసుకున్న 2 నుంచి 3 గంటల్లోపే మళ్లీ మాత్రలు వేసుకోవడం కూడా చాలా ప్రమాదం. ఏదైనా మాత్ర పనిచేయాలంటే.. కాస్త సమయం పడుతుందనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎంతకీ జ్వరం తగ్గకపోతే మీరు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. 


ఫార్ములా ఒకటే.. పేర్లు అనేకం: పారాసెటమాల్ వంటి మాత్రల్లో స్టెరాయిడ్లు ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఆ మాత్రలను తీసుకుంటే హాని తప్పదు. సాధారణంగా జ్వరం, మైగ్రేన్, పీరియడ్స్ నొప్పి, తలనొప్పి, పంటి నొప్పి, శరీర నొప్పికి పారాసెటమాల్‌ను ఉపయోగిస్తారు. ఈ మాత్రలను మార్కెట్లో.. కాల్పోల్, క్రోసిన్, డోలో, సుమో ఎల్, కబిమోల్, పాసిమోల్ వంటి అనేక పేర్లతో విక్రయిస్తుంటారు. WebMDలో పేర్కొన్న వివరాల ప్రకారం..  మీరు మూడు రోజులుగా పారాసెటమాల్ మందు తీసుకున్నా జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎలాంటి నొప్పి వచ్చినా 10 రోజులకు మించి పారాసెటమాల్ తీసుకోకూడదు. అంతే కాకుండా కాలేయ, కిడ్నీ సమస్యలు, ఆల్కహాల్ అలవాటు, బరువు తక్కువగా ఉన్న సందర్భాల్లో వైద్యుల సలహా లేకుండా పారాసిటమాల్ తీసుకోకూడదు.


పారాసెటమాల్ అధిక మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది?:
⦿ పారాసెటమాల్ మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే దుష్ప్రభావాలు తప్పవు. 
⦿ అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, రక్త రుగ్మతలు వంటి సమస్యలు రావచ్చు. 
⦿ పారాసెటమాల్‌ను అతిగా తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 
⦿ పారాసెమాల్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల విరేచనాలు, విపరీతమైన చెమటలు పట్టడం, ఆకలి లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం, వాంతులు, కడుపునొప్పి, ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, తిమ్మిరులు వంటివి ఏర్పడవచ్చు. 


గమనిక: పై వివరాలు కేవలం మీ అవగాహన కోసమే అందించాం. వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను ఇక్కడ యథావిధిగా పేర్కొన్నాం. ఈ కథనంలోని అంశాలకు ‘ఏబీపీ దేశం, ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యులు కాదని గమనించగలరు.