ICICI Bank Q4 FY24 Result: 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4 FY24) ఐసీఐసీఐ బ్యాంక్ రూ.10,708 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, YoY ప్రాతిపదికన ఇది 17.4% జంప్. ఈ ఏడాది కాలంలో నికర వడ్డీ ఆదాయం, అడ్వాన్సులు పెరగడం + కేటాయింపులు తగ్గడం వల్ల బ్యాంక్ లాభం పెరిగింది. QoQ (Q3 FY24) ప్రాతిపదికన లాభం రూ.10,272 కోట్ల నుంచి 4.24% పెరిగింది.
వడ్డీ ఆదాయం - వడ్డీయేతర ఆదాయం
బ్యాంక్ ఆర్థిక ఫలితాల్లో చూడాల్సిన కీలక అంశం నికర వడ్డీ ఆదాయం (NII). ఐసీఐసీఐ బ్యాంక్ NII YoYలో 8.1% పెరిగింది, రూ.19,093 కోట్ల నుంచి రూ.17,667 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) మాత్రం 4.40 శాతానికి దిగి వచ్చింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.90%గా ఉంది, FY24 మూడో త్రైమాసికంలో 4.43%గా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 15.7% జంప్‌తో రూ.5,930 కోట్లకు పెరిగింది.
కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఫీజ్ నాలుగో త్రైమాసికంలో 12.5% వృద్ధితో రూ.4,830 కోట్ల నుంచి రూ.5,436 కోట్లకు పెరిగింది.
లోన్లు - డిపాజిట్లు
జనవరి-మార్చి కాలంలో బ్యాంక్ ఇచ్చిన అడ్వాన్స్‌లు 16.8% YoY పెరిగి రూ. 11.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ లోన్లు 19.4% పెరిగి రూ.6,662.61 కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత రుణాలు 32.5% పెరిగి రూ.1,166.77 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ పోర్ట్‌ఫోలియోలో రిటైల్ లోన్ల వాటా 54.9%.
ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లలో మంచి గ్రోత్ కనిపించింది. 2024 మార్చి 31 నాటికి, ఈ రుణదాత డిపాజిట్లు 19.6% YoY జంప్‌తో రూ. 14.13 లక్షల కోట్లకు పెరిగాయి. వీటిలో... టర్మ్/ఫిక్స్‌డ్ డిపాజిట్లు 27.7% YoY గ్రోత్‌తో రూ.8.17 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ ఖాతా డిపాజిట్లు 13% & సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 4.6% పెరిగాయి.
ఆస్తుల నాణ్యత
బ్యాంక్ రిపోర్ట్ కార్డ్‌లో చూడాల్సిన మరో కీలక అంశం ఆస్తుల నాణ్యత. రిపోర్టింగ్ టైమ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ మెరుగైన గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPAs) నిష్పత్తి 2.30% YoY నుంచి 2.16 శాతానికి తగ్గింది. దీని అర్ధం మొండి బకాయిలు తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తుల (NNPAs) నిష్పత్తిని చూస్తే.. 2023 డిసెంబర్ 31 నాటికి 0.44% నుంచి 2024 మార్చి 31 నాటికి 0.42 శాతానికి మెరుగుపడింది. మొత్తం కేటాయింపులు (Provisions) రూ.1619 కోట్ల నుంచి 50% పైగా తగ్గి రూ.718 కోట్లకు పరిమితమయ్యాయి, ఇది చాలా మంచి పరిణామం.
డివిడెండ్
ICICI బ్యాంక్ ప్రతి ఈక్విటీ షేరుకు రూ.10 డివిడెండ్ ప్రకటించింది. త్వరలో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (AGM) వాటాదార్ల నుంచి దీనికి ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత డివిడెండ్ ప్రయోజనం షేర్‌హోల్డర్లకు అందుతుంది.
శుక్రవారం (26 ఏప్రిల్ 2024) ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ధర స్వల్పంగా 0.53% తగ్గి రూ.1,107.15 దగ్గర ఆగింది. గత 6 నెలల కాలంలో దాదాపు 20%, గత 12 నెలల కాలంలో దాదాపు 21%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 10% పైగా లాభాలను ఈ స్టాక్ అందించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్‌లో సొమ్ములు సంపాదించే ఛాన్స్! - వచ్చే వారం 3 ఐపీవోలు, 4 లిస్టింగ్స్