Healthy Breakfast Recipes: ఆరోగ్యకరమైన జీవనానికి ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం. బ్రేక్ ఫాస్టులో ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే అంత యాక్టివ్ గా ఉంటాం. మీరు కూడా బ్రేక్ ఫాస్టులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని చేర్చుకునే ప్రయత్నం చేయండి. పౌష్టికాహారం తీసుకుంటే అది రోజంతా శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది. పదే పదే ఆకలి వేయదు. అంతేకాదు బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించేందుకు కొన్ని ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 


గుడ్డు:


గుడ్డులో ప్రొటీన్ తోపాటు చాలా పోషకాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. గుడ్డు రుచికరంగా ఉంటుంది. ప్రొటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. గుడ్లను బ్రేక్ ఫాస్టులో తీసుకుంటే చాలా మంచిది. గుడ్డు తిన్నతర్వాత మనకు కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. రోజంతా ఆహారం తినాలనే కోరికను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. గుడ్డులోని పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటుంది. ఇవి కంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. 


రవ్వఉప్మా:


రవ్వ ఉప్మా చేయడం చాలా సులభం. ఉదయాన్నే బ్రేక్ ఫాస్టులో రవ్వ ఉప్మాను చేర్చుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయలను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వేరుశనగలు, ఆవాలు, కరివేపాకు, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి, పప్పులు వేసి రవ్వ ఉప్మాను తయారు చేయవచ్చు. ఉదయం అల్పాహారంలో రవ్వ ఉప్మాను తీసుకుంటే రోజంతా కడుపు నిండిన అనుభూతిని కలుగుతుంది. 


ఓట్స్ ఇడ్లీ:


ఓట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. ఓట్స్ తో ఇడ్లీ చేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఓట్స్ ఇడ్లీ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు, ఖనిజాలు, రకరకాల విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెసిపీ ఉదయం బ్రేక్ ఫాస్టుకు మంచి ఎంపిక. 


వెజిటేబుల్ మసాలా దోశ:


దోశ అంటే చాలా మంది ఎంతో ఇష్టం. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటుంటారు. చట్నీలేదా బంగాళదుంప కర్రీతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇవే కాకుండా ఇతర కూరగాయలతో మసాల కర్రీ చేసుకుని కూడా తినవచ్చు. ఆలుతోపాటు చీజ్, క్యారెట్, క్యాప్సికమ్ వంటి వేసి చేసుకోవచ్చు. ఆలు, మసాలా కర్రీ ఇష్టపడనివారు పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ చేర్చుకోవచ్చు. 


పరాటా:


పరాటాను బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే రోజంతా ఆకలిగా ఉండదు. ఆలు, క్యాబేజీ, బీట్ రూట్ లేదా క్యారెట్ లతో పరాటాలను తయారు చేయవచ్చు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. 


అటుకుల ఉప్మా:


అల్పాహారం కోసం అటుకుల ఉప్మా చాలా ఆరోగ్యకరమైన రెసిపీ. ఇందులో బీన్స్, క్యారెట్, పప్పులు, వేరుశనగలు వేసి చేసుకుంటే రుచికరంగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులభం. 15 నిమిషాల్లో అటుకుల ఉప్మాను చేయవచ్చు. ఇందులో డ్రైఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 


Also Read : ఒక్కో జ్ఞాపకం ఒక్కో బ్రెయిన్​ సెల్​ని కరాబ్ చేస్తుందట.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు