IPOs Next Week: స్టాక్‌ మార్కెట్‌లో వచ్చే వారం కొత్త ముఖాలు కనిపించనున్నాయి. ఆ వారంలో 3 ఇనీషియల్‌ పబ్లిక్‌ ఇష్యూలు (IPOs) ఓపెన్‌ కానున్నాయి, 4 కంపెనీలు కూడా అరంగేట్రం చేయనున్నాయి. వీటి కారణంగా, స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు సంపాదించేందుకు పెట్టుబడిదార్లకు వారమంతా తలుపులు ఓపెన్‌లో ఉంటాయి. గత వారం, JNK ఇండియా IPO సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చింది, సుమారు 28 రెట్లు స్పందన అందుకుంది. ఈ కంపెనీ షేర్లు మొయిన్‌ బోర్డ్‌లో ఏప్రిల్ 30న (మంగళవారం) లిస్ట్‌ అవుతాయి.  


JNK ఇండియాతోపాటు మరో మూడు IPOలు BSE SME ‍‌(Small and Medium Enterprises) విభాగంలో 30న లిస్ట్‌ అవుతాయి. ఆ మూడు కంపెనీలు - ఎంఫోర్స్ ఆటోటెక్, శివమ్ కెమికల్స్, వర్యా క్రియేషన్స్. వీటికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 


వచ్చే వారంలో ఓపెన్‌ కానున్న ఐపీవోలు (Upcoming IPOs next week)


సాయి స్వామి మెటల్స్ & అల్లాయ్స్ ఐపీవో (Sai Swami Metals and Alloys IPO) 
ఈ కంపెనీ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రొడక్ట్స్‌ తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌ ఏప్రిల్ 30న ప్రారంభమై, మే 03వ తేదీన ముగుస్తుంది. ఐపీఓ ద్వారా రూ. 15 కోట్లు సంపాదించాలన్నది కంపెనీ ఆలోచన. ఐపీవోలో ఒక్కో షేర్‌ ధరను రూ. 60గా నిర్ణయించారు. ఈ IPO కోసం బిడ్‌ వేసే ఆలోచన ఉంటే, ఒక లాట్‌లో 2,000 షేర్లను కొనుగోలు చేయాలి. పబ్లిక్‌ ఆఫర్‌లో సగం వాటాను (50%) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్‌ చేశారు. 


ఎంకే ప్రొడక్ట్స్‌ ఐపీవో ‍‌(Amkay Products IPO)
ఈ కంపెనీ వైద్య పరికరాలు & ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ IPO కూడా ఏప్రిల్ 30న ప్రారంభమై మే 03న ముగుస్తుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ.12.61 కోట్లు సమీకరించాలన్న కంపెనీ ప్లాన్‌ చేసింది. ఐపీవోలో ఒక్కో షేర్‌ ధరను రూ. 52 నుంచి రూ. 55గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 2,000 షేర్లను కొనుగోలు చేయాలి. పబ్లిక్‌ ఆఫర్‌లో 35% వాటాను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించారు.


స్టోరేజ్ టెక్నాలజీ అండ్‌ ఆటోమేషన్ ఐపీవో (Storage Technologies and Automation IPO)
ఈ కంపెనీ మెటల్ స్టోరేజ్‌ రాక్‌లు, ఆటోమేటెడ్ గిడ్డంగ్స్‌, ఇతర నిల్వ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ IPO ఏప్రిల్ 30 నుంచి మే 03 వరకు లైవ్‌లో ఉంటుంది. పబ్లిక్‌లోకి వచ్చి రూ. 29.95 కోట్లు తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది. ఐపీవోలో ఒక్కో షేర్‌ ధరను రూ. 73 నుంచి రూ. 78గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 1,600 షేర్లను కొనుగోలు చేయాలి. 35% పోర్షన్‌ను చిన్న పెట్టుబడిదార్ల కోసం పక్కనబెట్టారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లకు ప్రమోషన్‌ - లాభపడే స్టాక్స్‌ ఇవి!