Stock Market News Updates Today 10 Oct: గ్లోబల్‌ మార్కెట్ల నుంచి గ్రీన్‌ సిగ్నల్స్‌ రావడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (గురువారం, 10 అక్టోబర్‌ 2024) ఉదయం గొప్పగా ప్రారంభమైంది. బుధవారం నాడు అమెరికన్ మార్కెట్లు లాభాలతో ముగియగా, ఈ రోజు ఆసియా మార్కెట్లు అద్భుతంగా ర్యాలీ చేస్తున్నాయి. దీంతో మన మార్కెట్లకూ ఉత్సాహం వచ్చింది. సెన్సెక్స్ దాదాపు 250 పాయింట్ల జంప్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల గ్యాప్‌-అప్‌ అయింది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ షేర్లలో జోష్‌ వల్ల ఆయా ఇండెక్స్‌లు పెరుగుతున్నాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ కౌంటర్లలోనూ సందడి కనిపించింది. టాటా గ్రూప్‌లోని స్టాక్స్‌లో కొన్ని లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (బుధవారం) 81,467 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 365 పాయింట్లు పెరిగి 81,832.66 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 24,982 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 85 పాయింట్లు పెరిగి 25,067.05 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


షేర్ల పరిస్థితి
ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 15 షేర్లు లాభాల్లో, 15 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాప్‌ గెయినర్స్‌లో.. టాటా కెమికల్స్ 4.24 శాతం, భెల్ 2.74 శాతం, ఒబెరాయ్ రియాల్టీ 2.47 శాతం, డీఎల్ఎఫ్ 2.20 శాతం, నాల్కో 2.29 శాతం, పాలిక్యాబ్ 2.24 శాతం, ఇండియన్‌ హోటల్స్‌ 2.69 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. టాప్‌ లూజర్స్‌లో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.97 శాతం, దివీస్ ల్యాబ్ 0.80 శాతం, సీమెన్స్ 1.01 శాతం, ట్రెంట్ 0.80 శాతం క్షీణించాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో 44 షేర్లు లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, లార్సెన్ & టూబ్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐటీసీ, ఐషర్ మోటార్స్ పెరిగాయి. నష్టపోయిన పేర్లలో.. టాటా మోటార్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ ఉన్నాయి.


సెక్టార్ల వారీగా... 
ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో ఒత్తిడి కనిపిస్తోంది. ఇవి మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు స్పీడ్‌ ట్రాక్‌పై ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్స్, ఎనర్జీ, ఆయిల్ & గ్యాస్, రియల్ ఎస్టేట్, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 131 పాయింట్లు లేదా 0.26 శాతం పెరుగుదలతో ట్రేడవుతోంది. 


విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.55 శాతం పెరిగింది. నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 100 సూచీ 0.80 శాతం ముందుకు వెళ్లింది.


ఉదయం 10.00 గంటలకు, సెన్సెక్స్ 293.71 పాయింట్లు లేదా 0.36% పెరిగి 81,760.81 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 84.65 పాయింట్లు లేదా 0.34% పెరిగి 25,066.60 దగ్గర ట్రేడవుతోంది.


గ్లోబల్‌ మార్కెట్లు 
ఆసియా మార్కెట్లలో... నికాయ్‌ 0.25 శాతం, హ్యాంగ్ సెంగ్ 4.06 శాతం, కోస్పీ 0.49 శాతం, షాంఘై మార్కెట్ 2.87 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. 


నేడు, పెద్ద కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది. దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (ITC) 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటిస్తుంది. టాటా ఎల్‌క్సీ (Tata Elexi Q2 Results), ఇరెడా (IREDA Q2 Results) ఫలితాలను కూడా ప్రకటిస్తారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పేరు గొప్ప, పనితీరు దిబ్బ - రూ.10,000 కోట్ల కంటే పెద్ద IPOలన్నీ హ్యాండ్‌ ఇచ్చాయ్‌