Stock Market Journey in 2023: దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో 2023 సంవత్సరం ఒక అరుదైన ఘట్టంగా నిలుస్తుంది. ఈ ఏడాది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు చేసిన జర్నీ చాలా కాలం గుర్తుంటుంది. సెన్సెక్స్‌ 30, నిఫ్టీ 50 మాత్రమే కాదు... అన్ని ఇండెక్స్‌లు ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా.. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు చెలరేగిపోయాయి.


వాస్తవానికి, ఈ ఏడాది తొలి 3 నెలల్లో మార్కెట్లో తీవ్రస్థాయి భయాలు కనిపించాయి. ఆర్థిక మాంద్యం, వడ్డీ రేట్ల పెంపు, FIIల ఔట్‌ఫ్లోస్‌ ఆందోళనలతో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు కుంటుతూ నడిచాయి. ఆ తర్వాత, ఏప్రిల్‌ నుంచి పరిస్థితి మారింది. ఈ ఏడాది చివరి 3 నెలల్లో, చుక్కలే లక్ష్యంగా రెక్కలు విప్పుకుని ఎగిరాయి.


ఈ సంవత్సరం మొత్తంలో, నిఫ్టీ 18%, సెన్సెక్స్‌ 19% వరకు పెరిగాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు దాదాపు 50% దూసుకెళ్లాయి. 


వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు లాభాల్లో నిలిచిన ఏకైక స్టాక్‌ మార్కెట్ ఇండియా మాత్రమే. మరే దేశం కూడా ఇలాంటి ఘనతను అందుకోలేదు. అంతేకాదు, ఈ ఏడాది ఇండియన్‌ మార్కెట్ల విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా, చైనా, జపాన్‌ తర్వాత ఆ మైల్‌స్టోన్‌ దాటింది భారత స్టాక్‌ మార్కెట్లే.


క్యాష్‌ మార్కెట్‌లో జరిగే ట్రేడ్ల సంఖ్య ఆధారంగా, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎక్స్ఛేంజీగా నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (NSE) నిలిచింది. ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎక్స్ఛేంజీగా అవతరించింది. ఈ ఘనతలు ఈ సంవత్సరంలోనే సాధ్యమయ్యాయి. 


మదుపర్ల సంపదగా పిలిచే BSEలోని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ ‍‌(Market capitalization of listed companies on BSE) ఈ ఏడాది ఏకంగా రూ. 81.90 లక్షల కోట్లు పెరిగింది, మొత్తం రూ. 364 లక్షల కోట్లకు చేరింది. ఇది ఆల్‌ టైం గరిష్టం. 


సెన్సెక్స్‌ & నిఫ్టీ ఈ ఏడాదిలో చాలా రికార్డ్‌లు సృష్టించాయి, తమ రికార్డులు తామే బద్ధలు కొట్టుకుంటూ ముందుకు సాగాయి. 


2023లో సెన్సెక్స్‌ మైలురాళ్లు (Sensex Milestones in 2023)
జూన్‌ 30న - 64,000
జులై 03న - 65,000
జులై 14న - 66,000
జులై 19న - 67,000
డిసెంబర్‌ 04న - 68,000
డిసెంబర్‌ 05న - 69,000
డిసెంబర్‌ 14న - 70,000
డిసెంబర్‌ 15న - 71,000
డిసెంబర్‌ 27న - 72,000
డిసెంబర్‌ 28న - జీవిత కాల గరిష్ట స్థాయి 72,484.34 (Sensex all time high) 


ఒక్క డిసెంబర్‌ నెలలోనే సెన్సెక్స్ 8000 పాయింట్లు పైగా పెరిగింది.


నిఫ్టీ విషయానికి వస్తే, ఈ ఏడాది నిఫ్టీ50 బాస్కెట్‌లోని 27 స్టాక్స్‌ కొత్త లైఫ్‌ టైమ్‌ హైస్‌ను టచ్‌ చేశాయి. 40కి పైగా స్టాక్స్‌ 100 శాతం వరకు రిటర్న్స్‌ ఇచ్చాయి. IPOల సబ్‌స్క్రిప్షన్‌, లిస్టింగ్‌ డే గెయిన్స్‌ విషయంలో... 2023లో కనిపించిన ఉత్సాహం గతంలో లేదు. మొత్తంగా చూస్తే, ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ చరిత్రలో 2023 సంవత్సరం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.


2023లో నిఫ్టీ మైలురాళ్లు (Nifty Milestones in 2023)
జూన్‌ 28న - 19,000 పాయింట్ల మార్క్‌ 
సెప్టెంబర్‌ 11న - 20,000 పాయింట్ల మైలురాయి
డిసెంబర్‌ 8న - 21,000 పాయింట్ల స్థాయి
డిసెంబరు 28న - జీవిత కాల గరిష్ఠ స్థాయి 21,801.45 (Nifty all time high) 


సెబీ (SEBI), ఈ ఏడాది ప్రారంభంలో ట్రేడింగ్‌ + 2 డేస్‌ (T+2) సెటిల్‌మెంట్‌ను, ఆ తర్వాత T+1 సెటిల్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: జనవరి 1న అన్ని బ్యాంక్‌లకు సెలవు, వచ్చే నెలలో 16 రోజులు పని చేయవు