Kavitha On Congress :  తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామని చెబుతున్న ఆరు గ్యారంటీలపై ఎన్నో సందేహాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.  హనుమకొండలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పింఛన్లు వస్తున్న 44 లక్షల మందికి రూ.4వేలకు పెంచి.. ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారెంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు అడగట్లేదని అయోమయంలో ఉన్నారని అన్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ మళ్లీ అడుగుతారా? లేదా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు.


200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్‌ ఇస్తామని చెప్పారు కాబట్టి.. వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా? వద్దా? అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానా ఉన్నాయని అన్నారు. చాలా ఇండ్లలో మగవాళ్ల పేరు మీదనే గ్యాస్‌ సిలిండర్లు ఉన్నాయని.. అలాంటి వాళ్లకు 500 గ్యాస్‌ సిలిండర్‌ వర్తిస్తుందా? లేదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ భృతిపై ఫామ్‌లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు.
  
 బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటించి, ఓపికతో ఉండి.. మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల మనసును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కిరావడం జరుగుతుందని అన్నారు. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌కు మాకు కేవలం 1.7 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందన్నారు. వందరోజుల తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమ్మక్క సారలమ్మ మహా జాతరకు జాతీయ పండగగా గుర్తింపు ఇవ్వాలని కవిత పేర్కొన్నారు. ‘‘లక్షలాది మంది భక్తులు దర్శించుకునే వన దేవతలకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రధాని మోదీ కృషి చేయాలి.                             


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సమ్మక్క సారలమ్మ జాతరను విస్మరించారు. తెలంగాణ వచ్చాక జాతరకు వైభవం తెచ్చాం. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. సరైన విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. జాతరకు వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ స్టాండు మారదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం విచారణ జరుపుతోంది కదా... చూద్దాం ఏం జరుగుతుందోనన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారి సెక్యూరిటీని అధికారులు చూస్తారన్నారు. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారని.. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ముఖ్యమంత్రి గౌరవమే తగ్గుతుందని కవిత పేర్కొన్నారు.